Adilabad: కానరాని కారుమబ్బులు.. మొలకెత్తని పత్తి విత్తులు.. నిరాశలో రైతు

నైరుతి వచ్చినా కానీ పెద్దలు వానలు మాత్రం పడటం లేదు. ఏటా ఈ పాటికి పత్తి విత్తులు పెట్టి 10 రోజులు అయ్యేది. కానీ ఈ ఏడాది వానలు లేక లేటయ్యింది. వేసిన విత్తులు కూడా మొలకెత్తుతాయో లేదో అన్న భయం పట్టుకుంది.

Adilabad: కానరాని కారుమబ్బులు.. మొలకెత్తని పత్తి విత్తులు.. నిరాశలో రైతు
Cotton Field

Edited By:

Updated on: Jul 05, 2023 | 11:25 AM

కారు మబ్బు కానరావడం లేదు. కార్తెలు దాటి పోతున్న వరుణుడి కరుణించడం లేదు. తొలకరి చినుకుతో భారీ ఆశల నడుమ పత్తి‌సాగు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ రైతు వానలు‌ కురవక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పత్తి విత్తును కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. బిందెలు , డ్రమ్ములతో నీళ్లు పోస్తూ విత్తనం పాడవకుండా కాపాడుకుంటున్నారు. సకాలంలో వానలు కురిసేలా వరుణ దేవుడు దీవించాలని కోరుతూ ఊరురా గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేఘాలవైపు ఆశగా చూస్తున్నా వరుణిడి జాడ మాత్రం కానరావడం లేదు.

కానరాని కారుమబ్బులు.. మొలకెత్తని పత్తి విత్తులు

ఇప్పటికే తొలకరి జల్లులతో పచ్చగా కనిపించాల్సిన ఉమ్మడి ఆదిలాబాద్ పల్లెలు వాన చినుకు లేక మోడుబారి దర్శనమిస్తున్నాయి. ఏరువాకతో పండుగ వాతావరణంలో ఉండాల్సిన రైతు చినుకు జాడ కనిపించక ఆందోళన చెందాల్సిన పరిస్థితి. రోహిణి కార్తెకు వానలు షురూ అవ్వాలి. మృగశిరకు భారీ వర్షాలు కురవాలి. ఆరుద్ర కార్తె కూడా దాటిపోయింది. అయినా వాన జాడ మాత్రం కనిపించడం లేదు. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా ఆశించిన మేరా వర్షాలు పడటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి , తలమడుగు , భీంపూర్ , నార్నూర్ , బోథ్ , ఇచ్చోడ మండలాల పరిదిలో లక్షా 75 వేల ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట ఎండిపోయే ప్రమాదం లో పడింది. విత్తనాలు‌ మొలకెత్తకపోవడంతో తీవ్ర ఆందోళనలో పడిపోయారు పత్తి రైతులు.

జూన్ రెండో వారంలో వేసిన పంటలు మొలకెత్తకపోవడంతో జూన్ మూడో వారంలో కురిసిన వర్షాలకు మరోసారి పత్తి‌ విత్తనాలు నాటారు ఆదిలాబాద్ రైతులు. అయితే ఈసారి మూడు రోజులు మురిపించిన వానలు.. వారం రోజులు దాటినా కానరాక పోవడంతో ఆ పంటలను కాపాడుకునేందుకు బిందెలతో నీళ్లు పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎకరా లోపు అయితే బిందెలతో నీళ్లు పోసి కాపాడుకోగలమని.. ఎకరానికి పైగా ఉన్న పొలాల్లో వేసిన పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు ఆదిలాబాద్ పత్తి రైతులు. వ్యవసాయ బావులు ఉన్న వారు ఇప్పటికే తడులు పెడుతున్నా… బావుల్లో కొద్దిపాటి నీరే ఉండడంతో వారిలో కూడా ఆశలు ఆవిరవుతున్నాయి. మరో రెండు రోజుల్లో వర్షాలు కురియకపోతే ఈసారి తీవ్ర నష్టాల భారీన పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు పత్తి‌రైతులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..