Lockdown at Medaram: కరోనా దెబ్బతో మేడారానికి తాళం పడింది. మినీ మేడారం జాతరలో విధులు నిర్వహించిన ఇద్దరు దేవాదాయశాఖ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వారికి కరోనా నిర్దారణ కావడంతో దర్శనాలు నిలిపివేశారు.. మార్చి01 నుండి 21వ తేదీ వరకు మేడారంలో సెల్ఫ్ లాక్ డౌన్ అమలుచేస్తున్నట్లు మేడారం పూజారుల సంఘం, దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు.
వివరాల్లోకెళితే.. లాక్ డౌన్ నేపథ్యంలో గత యేడాది మార్చి 24న మూత పడిన మేడారం దర్శనాలు తిరిగి అక్టోబర్ మాసం నుండి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 24 నుండి 27 వరకు మినీ మేడారం జాతరను నిర్వహించారు. ఈ జాతరకు సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యారు. మొదటిరోజు మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు పలువురు ప్రముఖులు సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకున్నారు.
ఇక గతంలో ఎన్నడూ లేని విదంగా ఈసారి మినీ మేడారం జాతరకు భక్తులు హాజరయ్యారు. అయితే మినీ జాతరకు హాజరైన వారంతా ఇప్పుడు ఆందోళనలో చిక్కుకున్నారు. ఎందుకంటే మేడారంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో వారిని ఎంజీఎం ఆస్పత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. కరోనా కలకలం నేపథ్యంలో మిగిలిన సిబ్బంది కూడా విధులు నిర్వహించడానికి వణికి పోయారు. భక్తుల సంఖ్య కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మరింత ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా మేడారం పూజారులు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించారు. మార్చి 01వ తేదీ నుండి 21వ తేదీ వరకు మేడారంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 21వ తేదీ వరకు భక్తులెవరూ మేడారానికి రావద్దని తెలిపిన పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు.. తిరిగి పునః దర్శనాలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయో మీడియా ద్వారా ప్రకటిస్తామని తెలిపారు.
Also read: