Nalgonda: దాడుల్లో దొరికిన పందెం కోళ్లను కోసుకు తిన్న పోలీసులు..

సాధారణంగా నేరం, గొడవలు జరిగినపుడు.. నిందితులను కోర్టులో హాజరు పరచడం పోలీసులు విధి. ఒక్కోసారి కేసులతో సంబంధం ఉన్న జంతువులు, పక్షులు కూడా అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తారు. తమ దాడుల్లో దొరికిన పందెం కోళ్లను పోలీసులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Nalgonda: దాడుల్లో దొరికిన పందెం కోళ్లను కోసుకు తిన్న పోలీసులు..
Fighting Cocks

Edited By:

Updated on: Jan 10, 2026 | 8:21 PM

సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఇది ఇల్లీగల్ అయినప్పటికీ.. సంప్రదాయం పేరుతో పందెం రాయుళ్లు కొనసాగిస్తూనే ఉంటారు. ప్రధానంగా ఆంధ్రాలో పందాలు బాగా జరుగుతాయి. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పందెంలో పాల్గొనే కోళ్లను పెంచుతుంటారు. వీటితోపాటు అక్కడక్కడ కోడి పందేల నిర్వహన జరగుతుంటుంది. తాజాగా నల్లగొండ పట్టణ శివారులో కోడి పందేలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి.. నాలుగు పందెం కోళ్లను పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అయితే పోలీసు స్టేషన్‌లో పందెం కోళ్లు మాయమయ్యాయి. బాదం, కాజు, పిస్తా వంటి బలవర్ధకమైన ఆహారంతో పెరిగిన కోళ్లపై పోలీసులకు మనసు పడింది. ఇంకేముంది ఆ పందెం కోళ్లను పోలీసులు వండుకొని తిన్నారట. ఆ పందెం కోళ్లకు మార్కెట్‌లో 60 వేల రూపాయల ధర పలుకుతుందట. పందేల కోసం దాదాపు ఏడాది నుంచి వాటికి తర్ఫీదు ఇస్తూ.. మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తూ పెంచారు. అలాంటి కోళ్లు పోలీసు స్టేషన్‌కు వస్తే.. పోలీసులు వండుకొని తినడం చర్చనీయాంశంగా మారింది.

అయితే టూ టౌన్ పోలీసులు మాత్రం పందెం కోళ్లను కోర్టుకు అప్పగించామని చెబుతున్నారు. కోర్టు వేసిన వేలంలో అధికారికంగా పాల్గొని..  3050 రూపాయలకు కొనుగోలు చేశామని అంటున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నది పోలీసుల వెర్షన్. అయితే కోళ్లు వేలం సంగతి సాధారణ జనం ఎవరికీ తెలియకపోవడం కొసమెరుపు.