ములుగు, ఆగస్టు 27: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తొలిసారి రాష్ట్రంలో అధికారిక పర్యాటన చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఈ రోజు ఆయన ములుగు జిల్లాకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు ముందస్తుగా భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. అయితే భద్రత నేపథ్యంలో వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ అనే వ్యక్తిని పాము కాటు వేసింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటున కానిస్టేబుల్‌ను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు నేడు, రేపు.. వరుసగా రెండు రోజుల పాటు యాదాద్రి, వరంగల్, ములుగు జిల్లాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటనలో ఉన్నారు. పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల సందర్శన అనంతరం లక్నవరం హాలాండ్స్‌లో బస చేస్తారు. గవర్నర్ తొలిసారి పర్యటనకు అధికార యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆగస్టు 27వ తేదీన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో 25 మంది ప్రముఖ రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహితలతో గవర్నర్ పరస్పరం చర్చల అనంతరం.. వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప, గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో బసచేసి మరుసటి రోజు హనుమకొండకు చేరుకుంటారు.