Telangana Budget Session: కాంగ్రెస్ ఖతర్నాక్ వ్యూహం.. సై అంటున్న బీఆర్ఎస్.. అసెంబ్లీ సమావేశాలకు తొలిసారిగా కేసీఆర్..

| Edited By: Shaik Madar Saheb

Feb 07, 2024 | 9:33 PM

Telangana Assembly Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభంకానున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అలాగే అసెంబ్లీ వేదికగా రెండు కొత్త పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉండడం.. నీటి ప్రాజెక్టుల వివాదం చ‌ర్చకు రానుండ‌టంతో.. సభ ఈసారి వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది.

Telangana Budget Session: కాంగ్రెస్ ఖతర్నాక్ వ్యూహం.. సై అంటున్న బీఆర్ఎస్.. అసెంబ్లీ సమావేశాలకు తొలిసారిగా కేసీఆర్..
Revanth Reddy - KCR
Follow us on

Telangana Assembly Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభంకానున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అలాగే అసెంబ్లీ వేదికగా రెండు కొత్త పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉండడం.. నీటి ప్రాజెక్టుల వివాదం చ‌ర్చకు రానుండ‌టంతో.. సభ ఈసారి వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం (ఫిబ్రవరి 8న) ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే జనవరి 26 సందర్భంగా గవర్నర్ స్పీచ్ పై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పింది. అయితే, ఇప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఏం ప్రసంగిస్తారనేది అందరిలో ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బడ్జెట్ సమావేశాలు వారం పైగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ స్పీచ్ ఒక రోజు, గవర్నర్ స్పీచ్ కు ధన్యవాద తీర్మానంపై చర్చకు మరోరోజు స‌భా స‌మ‌యాన్ని కేటాయించే అవకాశం ఉంది. ఇక‌ బడ్జెట్ ప్రతిపాద‌న‌కు ఒక రోజు కేటాయించి.. రెండు నుంచి మూడు రోజులు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది. ఇక ఇరిగేషన్ పై వైట్ పేపర్ విడుదల చేసి రెండు రోజులు సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల‌పాటు సభ జరిగే అవకాశం ఉంది. అయితే, బ‌డ్జెట్ స‌మావేశాలు సూదీర్ఘంగా జ‌ర‌గాల్సి ఉన్నప్పటికీ.. ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ కావ‌డం, త్వర‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యుల్ విడుద‌ల అవుతుంద‌న్న వార్తల‌తో.. వారం రోజుల‌కు మించి అసెంబ్లీ స‌మావేశాలు జ‌రగవనే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. అయితే, ముందుగా.. స్పీక‌ర్ అధ్యక్షత‌న జ‌రిగే బీఏసీ స‌మావేశంలోనే బ‌డ్జెట్ ప‌ని దినాలు, ఎజెండా ఖ‌రారు కానుంది.

10వ తేదీన శాసనసభలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓటన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.. శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరుసటి రోజు సభకి సెలవు ఇవ్వగా.. తిరిగి 12వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చించనున్నారు.. సభ ఈ నెల 17 వరకు నిర్వహించే అవకాశం ఉంది.. ప‌రిస్థితిని బట్టి సమావేశాలు పొడగించే అంశాన్ని ప్రభుత్వం ప‌రిశీలిస్తున్నట్లు సమాచారం..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మొదటి సారి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకి ఎంత కేటాయింపూలు పెట్టనున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేస్తుంది. ఇంకా రెండు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. రూ.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లు కట్టే అవసరం లేదని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ రెండు పథకాలను అమలు చేయనున్నట్లు సమాచారం.. ఈ రెండు పథకాలకు అర్హత కలిగిన కుటుంబాలు ఉన్నాయనే దానిపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ రెండు పథకాలను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. అభయ హస్తం ద్వారా అప్లై చేసుకున్న వారిలో ఎంత మంది ఏ పథకానికి అర్హులన్న లెక్కలను సేకరించింది ప్రభుత్వం.

ఈసారి సమావేశాలు రాజకీయ వేదికగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సభలో ఇరిగేషన్ శాఖ పై వైట్ పేపర్ విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎత్తులకు బీఆర్ఎస్ సైతం సై అంటుంది. మాజీ సీఎం కేసీఆర్ సైతం అసెంబ్లీకి వస్తానని చెప్పడంతో.. ఈ సమావేశాలపై ఆసక్తి మరింతగా పెరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విపక్షాలు ఒక వైపు విమర్శలు గుప్పిస్తుండటం.. మరోవైపు.. గత పదేళ్ల అవకతవకలను బయటపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని అధికారపక్షం చూస్తుంది. మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎవరు పై చేయి సాధిస్తారనేది.. మరికొన్ని రోజుల్లో తెలియనుంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..