Congress PAC: జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. వివరణ కోరిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సీరియస్‌గా ఉంది ఆ పార్టీ అధిష్టానం. నిన్న అసెంబ్లీ లాబీలో జగ్గారెడ్డి చేసిన కామెంట్లపై ఆరా తీశారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాకూర్.
Congress Political Affairs Committee: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సీరియస్‌గా ఉంది ఆ పార్టీ అధిష్టానం. నిన్న అసెంబ్లీ లాబీలో జగ్గారెడ్డి చేసిన కామెంట్లపై ఆరా తీశారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాకూర్. ఇవాళ గాంధీభవన్‌లో జరిగే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ సమావేశంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సీరియస్‌గా చర్చించే అవకాశం ఉంది. అయితే, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా ? లేదా అనేది ఈ సమావేశం తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇటీవల నియమితులైన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఇవాళ తొలిసారిగా సమావేశం అవుతుండటం విశేషం.
ఈ కమిటీలో పీఏసీ చైర్మన్‌గా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ ఉండగా, కన్వీనర్‌గా షబ్బీర్ అలీ, సభ్యులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. నియమితులయ్యారు. ఇక, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ ఆమోదించిన కమిటీల ఛైర్మన్లు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ సెక్రటరీ ఇంచార్జిలు కూడా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఉంటారు. ఈ జరిగే సమావేశంలో ఏమేరకు నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎప్పుడూ ఉండేదే. నేతలు ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకోవడం కొత్తేమీ కాదు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి దక్కకుండా చాలామంది నేతలు ఎన్నో కుట్రలు చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. మొత్తానికి అడ్డంకులన్నీ అధిగమించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయం ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసింది. పార్టీని లిమిటెడ్ కంపెనీగా మార్చి, కొత్త చీఫ్ ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే విమర్శించారు జగ్గారెడ్డి.
గజ్వేల్ సభపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటన ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి. ఇలా ఒకరి నెత్తిన మరొకరు చేయి పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? అని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీనా లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కూడా పార్టీలో గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం కొందరు పాకులాడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే తనకు గజ్వేల్ సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలను మరోసారి బయటపెట్టినట్టయింది.ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ నేతృత్వంలోని పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.