Telangana: చేనేత కార్మికుడి ఆత్మహత్య.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికుడి ఆత్మహత్య చేసుకున్నాడు. పనులు లేకపోవడంతో యాదగిరి ప్రాణాలు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైజింగ్ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం కలకల రేపింది. సిరిసిల్ల పట్టణంలోని బి. వై నగర్‌కు చెందిన పల్లే యాదగిరి అనే కార్మికుడు… ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆరునెలలుగా డైయింగ్ వర్క్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో యాదగిరి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. యాదగిరికి భార్య , ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒక కూతురికి వివాహం కాగా.. మరో కూతురు డిగ్రీ చదువుతోంది.
కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు బలయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిలేక కార్మికుడు ఉరి వేసుకున్నాడని చెప్పారు. ఇది ఆత్మహత్య కాదన్న కేటీఆర్.. ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు అందించిన చేయూతను అర్ధాంతరంగా నిలిపివేయడంతోనే ఈ రంగంలో మరణమృదంగం మోగుతోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..