తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతిని చల్లార్చేందుకు హైకమాండ్ యాక్షన్ మొదలు పెట్టింది. సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. దీంతో వెంటనే దిగ్విజయ్ సింగ్ పార్టీ నేత మహేశ్వర్‌రెడ్డికి ఫోన్ చేశారు. సాయంత్రం పెట్టాలనుకున్న మీటింగ్‌ను వాయిదా వేయాలని సూచించారు. అధిష్టానం ఏది చెబితే అది పాటిస్తామని, కానీ పార్టీ కోసం పని చేసిన వారికీ అవకాశం ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అంటూ మహేశ్వర్‌రెడ్డి దిగ్విజయ్ సింగ్ కు వివరించారు. దిగ్విజయ్ ఫోన్‌తో సీనియర్లు మీటింగ్ వాయిదా వేసుకున్నారు. త్వరలోనే దిగ్విజయ్ హైదరాబాద్ వస్తానన్నారని.. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. హైకమాండ్ రియాక్ట్ అయిన నేపథ్యంలో సాయంత్రం భేటీ పెట్టకపోవడమే బెటర్ అని సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు.
ఎగ్జిక్యూటివ్ పదవుల నియామకం నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి నెలకొన్న విషయం తెలిసిందే. సీనియర్లు, జూనియర్లు రెండుగా చీలి విమర్శలు సైతం చేసుకున్నారు. ఈ సమయంలో పార్టీలో నెలకొన్న సమస్యలను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. అధిష్టానం సూచనలతో రంగంలోకి దిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కోదండరెడ్డి పార్టీ నేతలతో మాట్లాడారు. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డితో బేటీ కానున్నట్లు తెలుస్తోంది.
ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ కు తెలంగాణకు కూడా రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్టానం ఫోకస్ చేసి పార్టీలో అంతర్గత నెలకొన్న సంక్షోభానికి తెరదించేందుకు ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా టి.కాంగ్రెస్ అడ్వైజర్‌గా దిగ్విజయ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు హైకమాండ్ సూచనలను పాటిస్తారా..? లేక యధాతథంగా గొడవలు కొనసాగిస్తారా..? అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. G9 నేతలు అధిష్టానం సూచనలతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..