ఆ పార్టీ క్యాడర్‎లో గందరగోళం.. మంత్రి కాన్వాయ్‎నే అడ్డుకున్న కార్యకర్తలు..

| Edited By: Srikar T

Aug 21, 2024 | 7:40 PM

అక్కడ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు హస్తం పార్టీని అతలాకుతలం చేస్తోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే స్వపక్షంలో చేరిన నేపథ్యంలో వర్గపోరు కాక రేపుతోంది. ఒకరిపై ఒకరు చూపిస్తున్న ఆధిపత్య పోరు ఏకంగా మంత్రినే అడ్డుకునే స్థాయికి చేరింది. నడిగడ్డ పాలిటిక్స్ హాట్ అంటే హాట్‎గా మారాయి.

ఆ పార్టీ క్యాడర్‎లో గందరగోళం.. మంత్రి కాన్వాయ్‎నే అడ్డుకున్న కార్యకర్తలు..
Telangana
Follow us on

అక్కడ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు హస్తం పార్టీని అతలాకుతలం చేస్తోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే స్వపక్షంలో చేరిన నేపథ్యంలో వర్గపోరు కాక రేపుతోంది. ఒకరిపై ఒకరు చూపిస్తున్న ఆధిపత్య పోరు ఏకంగా మంత్రినే అడ్డుకునే స్థాయికి చేరింది. నడిగడ్డ పాలిటిక్స్ హాట్ అంటే హాట్‎గా మారాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సరితా తిరుపతయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. ఇది హస్తం క్యాడర్‎ను అల్లకల్లోలం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా తన ఆధిపత్యమే నడవాలని ఆమె అనుకుంటుంటే.. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే‎ను అయ్యాను అని ఆయన అంటున్నారు. ఇద్దరి పోరు ఇప్పుడు స్వపక్ష పొరుగా మారింది. ఇది అలాగే విస్తరించి నియోజకవర్గంలో రాజకీయ వైరంగా మరింది.

నిన్న మొన్నటి వరకు ఈ ఇద్దరి మధ్యే ఉన్న వర్గ పోరు ఇప్పుడు తారా స్థాయికి చేరింది. ఏకంగా ప్రాజెక్టుల పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉంటే ప్రాజెక్టుల పర్యటనకు తనకు ఆహ్వానం అందలేదని.. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన మంత్రి, తన నివాసానికి రాలేదన్న కోపంతో సరితా తిరుపతయ్య వర్గం ఉన్నట్ల తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సరితా తిరుపతయ్య వర్గం చేసిన రచ్చ మామూలుగా లేదని నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటున్నారు. మంత్రి జూపల్లి కాన్వాయ్‎ను అడ్డుకోవడమే కాకుండా ఆమె నివాసానికి వెళ్ళెవరకు వదిలిపెట్టలేదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.

ఈ క్రమంలోనే సరితా తిరుపతయ్య వర్గం చేసిన పనికి.. మంత్రి జూపల్లి చేసేదేమీ లేక ఆమె నివాసంలోనే కాసేపు చర్చలు జరిపారు. అనంతరం ఆమెను వెంటబెట్టుకొని ప్రాజెక్టుల పర్యటనకు వెళ్ళారు. ఇక ప్రాజెక్టుల పర్యటన ఆద్యంతం ఉత్కంఠగానే కొనసాగింది. అటూ ఎమ్మెల్యే, ఇటు పార్టీ ఇంఛార్జి సరితా వర్గీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మార్గం మధ్యలో గట్టు మండలంలో తమ వాహనాలకు అడ్డువస్తున్నాడని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘటనలో ఎమ్మెల్యే బావమరిది మోహన్ రెడ్డి కారు ధ్వంసం అయ్యింది. పోలీసుల జోక్యంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

కేసులతో కాక రేపుతున్న రాజకీయం:

సీన్ కట్ చేస్తే అటు సరితా తిరుపతయ్య వర్గీయులు, ఇటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కేసులు నమోదవ్వడం అందరినీ షాక్‎కు గురిచేశాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా తమ విధులకు ఆటంకం కలిగించారని గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్‎లో ఎస్సై శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో సరితా తిరుపతయ్య అనుచరులు పెద్దదొడ్డి రామకృష్ణ, తిరుమల్‎తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. మరోవైపు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బావమరిదిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా తమ వాహనాన్ని అడ్డుకొని, దాడి చేశారని సరితా తిరుపతయ్య అనుచరుడు తిరుమలేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరి మధ్య వర్గ పోరు తారా స్థాయికి చేరడంతో పార్టీ క్యాడర్‎ను ఆగమాగం చేస్తోంది. నిన్నమొన్నటి వరకూ ఇరువురి మధ్యే ఉన్న ఈ ఇంటి పోరు.. ఏకంగా మంత్రిని ఆడుకోవడం వరకూ వెళ్లింది. అంతేకాకుండా పోలీసు కేసుల వరకు వెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మధ్య సయోధ్య కుదిరే వరకు పార్టీ పరిస్థితి ఇలానే ఉంటుందా లేక మరింత ముదురుతుందా అన్న ఆసక్తి నియోజకవర్గం ప్రజల్లో నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..