MP Revanth reddy : కేసీఆర్ ప్రభుత్వం కరోనా కేసులను తగ్గించి చూపడం వల్లే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు, మెడిసిన్లు తక్కువగా పంపుతోందని మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ తెలంగాణలోనే తయారవుతోందని, తెలంగాణ అవసరం తీరిన తర్వాతే బయట రాష్ట్రాలకు ఇస్తామని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలు వారి అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను పంపిస్తున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులన్నీ కేసీఆర్ బంధువులవేనని, అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదంటూ రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ సలహాలను విని ప్రధాని మోదీ మెచ్చుకున్నారని ప్రభుత్వం తెలిపిందని, ఇంకా నయం… ఢిల్లీకి పిలిపించి సన్మానం చేస్తారని కేసీఆర్ చెప్పుకోలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రెండో విడత కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ సర్కార్ ఘోరంగా విఫలమైందన్న ఆయన, కరోనా వ్యాక్సిన్‌ను కేవలం రెండు కంపెనీలే తయారు చేస్తున్నాయని, మిగతా కంపెనీలకు కేంద్ర అనుమతే లేదని, అలాంటి సమయంలో గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎవరిని మభ్య పెట్టడం కోసం ఆ టెండర్లను పిలుస్తున్నారని ప్రశ్నించారు. వ్యాక్సిన్ తయారీ చేస్తున్న రెండు కంపెనీల సాంకేతిక నైపుణ్యాన్ని ఇతర కంపెనీలకు ఇప్పించాలని, అప్పుడే అందరికీ వ్యాక్సిన్ అనే కల నెరవేరుతుందని రేవంత్ సూచించారు. వ్యాక్సిన్ అంశాన్ని కూడా వ్యాపారాత్మక ధోరణిలో ఆలోచించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మందులు, వ్యాక్సిన్‌పై కూడా జీఎస్టీ వసూలు చేయడం దుర్మార్గమ్మన్న ఆయన, కరోనా వైద్యానికి ఉపయోగించే అన్నింటిపై జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.