JC T CLP office comments : మాజీ మంత్రి, అనంతపురం జిల్లాలో టీడీపీ కీలకనేత జేసీ దివాకర్ రెడ్డి.. వ్యవహారం ఇప్పడు తెలంగాణ కాంగ్రెస్ లో కాకరేపుతుంది. అసెంబ్లీ సమావేశాలు జరగుతుండగా.. సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి.. సోనియా, రాహుల్ పై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తెలంగాణలో కాంగ్రెస్ కు అసలు భవిష్యత్తే లేదని.. కాంగ్రెస్ నేతలు వేరే మార్గాలు చూసుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాదు.. తెలంగాణను ఇచ్చిన సోనియా.. పార్టీని ముంచిందని కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పడు ఇవే జేసీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి.
జేసీ వ్యాఖ్యలపై ఇప్పడికే కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రస్తుతం టీడీపీ నేతగా ఉన్న జేసీ, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం ఏంటనీ.. కాంగ్రెస్ ను అడ్డుపెట్టుకుని ఎదిగిన జేసీ.. పార్టీకి మోసం చేసి టీడీపీలో చేరారని.. ఆయన మాకు నీతులు చెప్పేదేంటి..? అంటు సీనియర్ నేత వీహెచ్ ఇప్పటికే నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఇక ఇప్పడు జేసీ వ్యవహారంపై హైకమాండ్ సైతం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతగా ఉన్న జేసీ, పార్టీ అధినేత్రి సోనియా , రాహుల్ గాంధీలపై కామెంట్స్ చేయడంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేసిన ఠాగూర్… జేసీ అలా మాట్లాడుతుంటే మేరెందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారట. తెలంగాణలో అసలు పార్టీకి భవిష్యత్ లేదని జేసీ అంటుంటుంటే.. సీఎల్పీ నేతగా ఉన్న మీరు ఎలా మౌనంగా ఉంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఠాగూర్.. తక్షణమే దీనిపై హైకమాండ్ కు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. దీంతో.. ఆఘమేఘాల మీద భట్టి విక్రమార్క , శ్రీధర్ తో బాటు, జీవన్ రెడ్డి ల సంతకాలతో సీఎల్పీ కార్యాలయం జేసీ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది.
హైకమాండ్ సీరియస్ కావడంతో… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధిష్టానానికి వివరిస్తూ లేఖ వ్రాసారు. మీడియాలో వచ్చిన విధంగా.. కాంగ్రెస్ హైకమాండ్ పై జేసీ కాంట్రవర్సీ వ్యాఖ్యలేవీ చేయలేదని దీనిలో .. మీడియా కొంత వక్రీకరించిందని .. అంతేకాదు.. ఆయన పిచ్చాపాటిగా మాట్లాడిన సమయంలో తాము సైతం.. అదే స్థాయిలో ఖండించామని.. అయితే అవేవి మీడియాలో రాలేదని.. హైకమాండ్ కు ఇచ్చిన వివరణలో భట్టి విక్రమార్క పేర్కొన్నట్లు సమాచారం.
మొత్తానికి ఒకవైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతున్న వేళ.. అదీ.. సీఎల్పీ కార్యాలయంలో కూర్చుని.. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని జేసీ చేసిన వ్యాఖ్యలను అటు కాంగ్రెస్ అధిష్టానంతో పాటు పార్టీ క్యాడర్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు సైతం .. నీతులు చెబుతుంటే.. పార్టీ పెద్దలుగా ఉండి.. వాటిని ఖండించకపోవడం బాగాలేదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. మరి.. ఈ అంశంపై భట్టి వివరణ లేఖతో హైకమాండ్ కూల్ అవుతుందో లేదో.. చూడాలి.
Read also : Khushbu Sundar files nomination : థౌజండ్ లైట్స్ కి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ