తెలంగాణను వరణుడు ఇప్పట్లో వదిలేలా లేడు. ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర నష్టం కలిగించిన వర్షాలు.. ఇప్పుడు మరో ఐదు రోజులు పాటు కురుస్తాయట. అదికూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా్లో మోస్తరు వర్షాలు.. మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
కాగా, సోమ, మంగళవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మామిడి, వరి, మక్కజొన్న, పండ్ల తోటలు, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసింది. ఈ వర్షం ధాటికి నగరంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
ఇలా భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక రకాలుగా అవస్థలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలన్నీ వర్షార్పణం అవుతుండటంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..