వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో కలకలం.. భీమేశ్వర ఆలయం వద్ద నాగుపాము ప్రత్యక్షం!
తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు తరచూ సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా భీమేశ్వర ఆలయ సమీపంలోని వసతి గదుల సముదాయం వద్ద నాగుపాము ప్రత్యక్షం కావడం స్థానికంగా కలకలం రేపింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో పాముల సంచారం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురయ్యారు. ఆలయ పరిసరాల్లో పాములు కనిపిస్తుండటంతో భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
వేములవాడ భీమేశ్వర ఆలయ సమీపంలోని వసతి గదుల సముదాయ ప్రాంతంలో నాగుపాము కనిపించడంతో ఆలయ అధికారులు వెంటనే స్పందించారు. స్నేక్ క్యాచర్ జగదీశకు సమాచారం అందించడంతో ఆయన అక్కడికి చేరుకొని నాగుపామును పట్టుకున్నట్లు తెలిసింది. దీంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, గత కొన్ని నెలలుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ పాములు తరచూ కనిపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు. భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాములు ప్రత్యక్షమవుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వసతి గదుల సముదాయాలు, ఆలయ పరిసరాల్లోకి వచ్చే భక్తుల భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఆలయ పరిసరాల్లో పాముల సంచారానికి గల కారణాలను గుర్తించి, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. పరిసర ప్రాంతాల్లో శుభ్రతను మెరుగుపరచడం, పాములు సంచరించే అవకాశమున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలించడం వంటి చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పాముల సంచారాన్ని అరికట్టి, భక్తులకు సురక్షిత వాతావరణం కల్పించడంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.




