Revanth Reddy: అలా చేస్తే.. 10 లక్షలమందితో సభపెట్టి మోదీని సన్మానిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

|

Apr 02, 2025 | 3:31 PM

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇకపై బీసీ రిజర్వేషన్ల కోసం తాము ఢిల్లీకి రాబోమన్నారు.. బీసీ వర్గాల బలం ఏంటో గల్లీలోనే చూపిస్తామన్నారు. ఈ విషయంలో బీజేపీ దిగి రావడమో లేక దిగిపోవడమో అనే పరిస్థితి కల్పిస్తామన్నారు. అయినను పోయిరావలె హస్తినకు అన్నట్టుగా ఇక్కడి వరకు వచ్చామన్నారు.

Revanth Reddy: అలా చేస్తే.. 10 లక్షలమందితో సభపెట్టి మోదీని సన్మానిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
CM Revanth Reddy
Follow us on

బీసీలు ధర్మయుద్ధం ప్రకటించాలి.. ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి.. మా డిమాండ్లకు దిగిరావాలి..లేదంటే మీరే దిగిపోవాలి.. మేం ఇప్పుడు సయోధ్యకు వచ్చాం.. బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపండి.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదించకపోతే.. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం అంటూ వ్యాఖ్యనించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్‌ వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలను బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. ఈ నిరసనలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, నటుడు సుమన్‌ పాల్గొన్నారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే ఈ ధర్నాకుకు హాజరై సంఘీభావం తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును.. పార్లమెంట్‌లోనూ ఆమోదించి అమలు చేయాలని.. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్‌కోటా కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇకపై బీసీ రిజర్వేషన్ల కోసం తాము ఢిల్లీకి రాబోమన్నారు.. బీసీ వర్గాల బలం ఏంటో గల్లీలోనే చూపిస్తామన్నారు. ఈ విషయంలో బీజేపీ దిగి రావడమో లేక దిగిపోవడమో అనే పరిస్థితి కల్పిస్తామన్నారు. అయినను పోయిరావలె హస్తినకు అన్నట్టుగా ఇక్కడి వరకు వచ్చామన్నారు సీఎం రేవంత్. తమ డిమాండ్‌ను ఢిల్లీ పెద్దలకు వినిపించేందుకే ఇక్కడ ధర్నా చేపట్టామన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటామంటే ప్రధాని మోదీకి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు సీఎం రేవంత్. తాము గుజరాత్‌లో భూమి అడగడం లేదన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్‌ను ఆమోదించాలన్నారు. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశమని.. తమ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని తామే కోరామన్నారు. బీజేపీ నేతలు స్పందించకపోవడంతోనే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తే.. 10 లక్షలమందితో సభపెట్టి మోదీని సన్మానిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలోని అన్ని వర్గాల నుంచి నాయకులు ఇక్కడికి వచ్చారని.. ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యతను గుర్తించాలని ఎమ్మెల్సీ కోదండరాం కోరారు.

తెలంగాణలో బీసీ బిల్లు పెట్టిన సీఎం రేవంత్ రియల్ హీరో అన్నారు నటుడు సుమన్. ప్రధాని మోదీ చొరవ తీసుకుని ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలన్నారు.

తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడాలని సూచించారు ఎమ్మెల్సీ విజయశాంతి. అప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు.

తాను ఎంతోమంది సీఎంలను చూశానని.. కానీ బీసీలకు మేలు చేయాలని ఆలోచించిన ముఖ్యమంత్రి మాత్రం సీఎం రేవంతే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.

కాగా.. మహా ధర్నా తరువాత సీఎం రేవంత్ సారథ్యంలోని మంత్రుల బృందం కేంద్రమంత్రులతో భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి మద్దతు ఇవ్వాలని వారిని కోరనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..