Telangana: మహిళా శక్తికి పట్టాభిషేకం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీకి అద్దె బస్సులు ఇచ్చే వినూత్న పథకంలో భాగంగా రెండో విడత కింద 553 కొత్త బస్సులను మంగళవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రతి బస్సుపై మహిళా సంఘాలకు నెలకు రూ.69 వేల వరకు అద్దె రానుంది. అంతేకాకుండా పలు కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు.

మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ అద్దె బస్సుల పథకాన్ని విస్తరిస్తూ రెండో విడతలో 553 కొత్త బస్సులను మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే మహిళా శక్తి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మహిళల సమక్షంలో జరిగే ఈ సభలో మహిళా సాధికారతకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. మహిళా సంఘాల ఆదాయ వనరులను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక మోడల్‌ను అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాలు కొనుగోలు చేసిన 153 బస్సులు టీజీఎస్‌ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు మరో 553 బస్సులు అదే విధానంలో ఆర్టీసీకి అందజేయనున్నారు.
ప్రతి బస్సు విలువ సుమారు రూ.36 లక్షలు కాగా, అందులో రూ.30 లక్షలను సెర్చ్ ద్వారా సమకూర్చారు. మిగిలిన రూ.6 లక్షలను మండల సమాఖ్యలు తమ సొంత నిధులు లేదా బ్యాంకు రుణాల ద్వారా భరించాయి. టీజీఎస్‌ఆర్టీసీతో ఒప్పందం ప్రకారం నిర్వహణ ఖర్చులు మినహాయించి ప్రతి బస్సుపై నెలకు సుమారు రూ.69 వేల అద్దె మహిళా సంఘాలకు అందనుంది. మహిళా శక్తి సభ వేదికగా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.500 కోట్ల విలువైన చెక్కులను సీఎం పంపిణీ చేయనున్నారు. అలాగే ఆర్టీసీ అద్దె బస్సుల హైర్ చార్జీల కింద రూ.20.30 కోట్లను విడుదల చేయనున్నారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం టీజీఎస్‌ఆర్టీసీకి రూ.199 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించనుంది. మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనను మరింత పెంచే దిశగా ఇది కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం మహిళా సంఘాలకు అందిస్తున్న రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే అంశంపై కూడా సీఎం కీలక ప్రకటన చేసే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వేలాది మహిళా సంఘాలకు మరింత ఆర్థిక వెసులుబాటు లభించనుంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం, ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు రూ.10,700 కోట్ల వరకు ఆదా చేసుకున్నారని సభలో వివరించే అవకాశం ఉంది. కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంలో ఈ పథకం పాత్రను ప్రభుత్వం ప్రస్తావించనుంది. సుమారు 25 వేల మంది మహిళలు పాల్గొనే ఈ మహాసభలో మహిళా సంఘాల బలోపేతం, ఉపాధి అవకాశాల విస్తరణ, ఆర్థిక స్వావలంబనపై ప్రభుత్వం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది.
