Telangana: తెలంగాణ ఖజానాపై లోతైన సమాలోచన.. రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అందుకేనా..?

CM Revanth Reddy Meets Raghuram Rajan: మిగులు బడ్జెట్‌గా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. ఈ పదేళ్లలో అప్పులు కుప్పగా మారిందని చెబుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన సాగించటానికి, పధకాలు అమలు చేయడానికి నిధులను ఎలా సమకూర్చాలి, సంపదను ఎలా పెంచుకోవాలి.. ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది రేవంత్ సర్కార్‌కి. గురువారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం నిర్వహించి.. బ్లూ ప్రింట్ తీసుకున్నారు.

Telangana: తెలంగాణ ఖజానాపై లోతైన సమాలోచన.. రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అందుకేనా..?
CM Revanth Reddy Meets Raghuram Rajan

Edited By: TV9 Telugu

Updated on: Jan 02, 2024 | 4:52 PM

CM Revanth Reddy Meets Raghuram Rajan: ఆరు గ్యారెంటీల అమలు వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటి అమలుపై పూర్తిగా దృష్టి సారించింది. ఇప్పటికే రెండు గ్యారంటీల్ని లైన్లో పెట్టేసింది. మరో వంద రోజుల్లో మిగతా నాలుగు గ్యారంటీల్ని కూడా నెరవేరుస్తాం అని మాట కూడా ఇచ్చింది. వచ్చే ఐదేళ్లలో 6 గ్యారంటీల అమలు కోసం రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంత? కావాల్సిన ఆర్థిక వనరుల్ని ఎలా సమకూర్చుకోవాలి? ప్రస్తుతం ఖజానా పరిస్థితి ఏంటి? ఈ కసరత్తును యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టేసింది.

మిగులు బడ్జెట్‌గా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. ఈ పదేళ్లలో అప్పులు కుప్పగా మారిందని చెబుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన సాగించటానికి, పధకాలు అమలు చేయడానికి నిధులను ఎలా సమకూర్చాలి, సంపదను ఎలా పెంచుకోవాలి.. ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది రేవంత్ సర్కార్‌కి. గురువారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం నిర్వహించి.. బ్లూ ప్రింట్ తీసుకున్నారు. అటు.. అన్ని శాఖలతో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్‌. మిగతా మంత్రులు కూడా అధ్యయనం పూర్తిచేసి.. నిధులు, అప్పులపై ఒక అంచనాకి వచ్చేశారు.

ఇరిగేషన్ శాఖ మీద రివ్యూ నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 56 వేల కోట్ల అప్పులున్నట్లు తేల్చేశారు. విద్యుత్ శాఖపై జరిగిన రివ్యూలో 85 వేల కోట్లు అప్పులున్నట్టు తేలింది. ఈ రుణబాధల నుంచి బయటపడాలంటే రాష్ట్రానికి ప్రణాళికా బద్ధమైన ఫైనాన్షియల్ ప్లాన్ అవసరమని డిసైడయ్యారు సీఎం రేవంత్. అందుకోసం జాతీయ స్థాయి ఆర్థిక వేత్తల్ని లైన్లో పెట్టారా? ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌తో తన నివాసంలో జరిగిన భేటీ వెనుక సీక్రెట్ అదేనా?

ఆర్బిఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురాం రాజన్‌కి బ్యాంకింగ్, కార్పొరేట్, ఫైనాన్స్, పొలిటికల్ ఎకానమీ, ఎకనామికల్ డెవలప్‌మెంట్.. ఇలా అనేక అంశాలపై పట్టు ఉంది. 2003 – 2006 మధ్యకాలంలో ఇంటర్నేషనల్ మోనిటర్ ఫండ్ IMFకి డైరెక్టర్‌గా చేశారు. రఘురామ్‌కి కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం కావలసిన ప్రణాళికలు-సూచనలు తీసుకోడానికే సీఎం రేవంత్ రెడ్డి రఘురాం రాజన్‌ను కలిసినట్టు తెలుస్తోంది.

ఆర్థిక శాఖ వ్యవహారాలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ఒక నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను ఆధారం చేసుకుని రఘురాం రాజన్ కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం ఉంది. ఈ సమావేశానికి రేవంత్‌తో పాటు భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు. సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి కూడా పాల్గొన్నారు.

ప్రస్తుతం పాలనాపరమైన ఖర్చులతో కలుపుకుని ఐదు గ్యారంటీలను అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై ఏటా 50 వేల కోట్ల అదనపు భారం పడుతుందనేది
ఒక అంచనా. అంటే… వచ్చే ఏదేళ్లలో ప్రభుత్వం రెండు లక్షల 50 వేల కోట్ల అదనపు సంపదను సృష్టించాలి. నైపుణ్యం పెంచాలి.. పెట్టుబడులను ఆకర్షించాలి.. ఉపాధి కల్పించాలి.. వీటన్నిటి కోసం నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళిక కావాలి. అందుకే ముఖ్యమంత్రి ఆర్బీఐ మాజీ గవర్నర్‌ని పిలిపించి.. లోతుగా చర్చించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..