Telangana: రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై సీఎం కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశం

|

Aug 22, 2024 | 6:35 AM

భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప‌నుల పురోగ‌తిని ఎప్పటిక‌ప్పుడు అందులో అప్‌డేట్ చేయాల‌ని సూచించారు. పనుల్లో ఎప్పటికప్పుడు పురోగతి కనిపించాలని...

Telangana: రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై సీఎం కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశం
Cm Revnth Reddy
Follow us on

తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని..అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ప‌నుల‌ పురోగ‌తి ఏంటనే దానిపై రోజువారీ స‌మీక్ష చేయాల‌ని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి..అప్‌డేట్స్‌ను అందులో పోస్ట్ చేయాలని నిర్దేశించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై.. సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప‌నుల పురోగ‌తిని ఎప్పటిక‌ప్పుడు అందులో అప్‌డేట్ చేయాల‌ని సూచించారు. పనుల్లో ఎప్పటికప్పుడు పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. RRR ఉత్తర భాగంలో భూ సేక‌ర‌ణ‌, ఇతర ప‌నుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంగారెడ్డి-ఆమ‌న్‌గ‌ల్‌-షాద్ న‌గ‌ర్‌-చౌటుప్పల్ మార్గానికి సంబంధించి భూ సేక‌ర‌ణ ప్రారంభించాల‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఉత్తర భాగంలో ఇప్పటికే చాలావరకూ భూ సేక‌ర‌ణ పూర్తయినందున..ఇకపై ద‌క్షిణ భాగంపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. ఈ రోడ్డు విష‌యంలో ఏవైనా సాంకేతిక‌, ఇత‌ర స‌మ‌స్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చ‌ర్చించాల‌ని అధికారులకు సూచించారు. RRR మ్యాప్‌ను గూగుల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు. ద‌క్షిణ భాగం ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేర్పుల‌ను సూచించారు. భ‌విష్యత్ అవ‌స‌రాలే ప్రాతిప‌దిక‌గా అలైన్‌మెంట్ ఉండాల‌ని..ఈ విష‌యంలో పార‌ద‌ర్శకంగా వ్యవ‌హ‌రించాల‌ని స్పష్టం చేశారు. తాను సూచించిన మార్పుల‌కు సంబంధించి క్షేత్ర స్థాయిలో ప‌ర్యటించి స‌మ‌గ్ర నివేదిక‌ను త్వర‌గా అంద‌జేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు..రేవంత్‌రెడ్డి.

ఫ్యూచ‌ర్ సిటీకి సంబంధించి రేడియ‌ల్ రోడ్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ర‌హ‌దారుల నిర్మాణానికి ముందే ఎక్కడిక్కడ అవి ప్రధాన రోడ్లకు అనుసంధానం కావాలని.. సిగ్నల్‌, ఇత‌ర స‌మ‌స్యలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు. రేడియ‌ల్ రోడ్లు..ఓఆర్ఆర్‌, ఆర్ఆర్ఆర్‌ల అనుసంధానానికి అనువుగా ఉండాల‌ని అలాగే ఫ్యూచ‌ర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ ర‌కాల ప‌రిశ్రమ‌లు, సంస్థల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా చూడాల‌ని సూచించారు. స‌మావేశంలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో పాటు న‌ల్గొండ ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..