తెలంగాణ భవిష్యత్తు అద్దాల మేడల్లో లేదు.. తరగతి గదుల్లోనే ఉందిః సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఆరుట్లలో ప్రారంభమైన ఈ విద్యా విప్లవం కేవలం ఒక గ్రామానికే పరిమితం కాదని, తెలంగాణ విద్యా వ్యవస్థకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ భవిష్యత్తు అద్దాల మేడల్లో లేదా రంగురంగుల గోడల్లో లేదని, తరగతి గదుల్లోనే ఉందని తమ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరడం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమన్నారు.
ఒక ప్రభుత్వ పాఠశాలకు ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే పరిస్థితి రావడం గొప్ప విషయమని, దీనికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలంటే ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని గుర్తు చేశారు. ప్రభుత్వ బడిలో చదివి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని, విద్యార్థులు కూడా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, అధికారులు, రాజకీయ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, విద్యా కిట్లు అందించే ప్రణాళికతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఆరుట్ల గ్రామం ఇందుకు ఆదర్శంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…