
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. ఫిబ్రవరి 26న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. రెండో విడత మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు అనుమతులతో పాటు రీజనల్ రింగ్ రోడ్ అంశంపై ప్రధానితో చర్చించనున్నారు.
త్వరలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో చట్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో చట్టం చేసి దీన్ని కేంద్రానికి పంపిస్తామని.. దీన్ని కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తీసుకొస్తామని మంత్రులు తెలిపారు. అసెంబ్లీలో ఈ అంశంపై చట్టం చేయడానికి ముందే ఈ అంశాన్ని ప్రధాని మోదీకి వివరించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్. ఇదే విషయాన్ని బుధవారం(ఫిబ్రవరి 26) జరగబోయే భేటీలో ప్రధాని మోదీకి వివరించనున్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని.. బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సహకరించాలని ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించనున్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెట్టి ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు.
తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సైతం సీఎం రేవంత్ కలవనున్నారని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పెద్ధలను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణతో పాటు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశముంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..