
మహిళా దినోత్సవం సందర్బంగా సీఎం రేవంత్ కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు ఉపయోగపడేలా త్వరలో పలు పథకాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందించే పథకంతో పాటు ఎలక్ట్రిక్ బస్సులపై ప్రకటన చేశారు. ప్రజాభవన్‌లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలను ప్రభుత్వం ఇవాళ ఘనంగా నిర్వహించింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళల్ని ప్రభుత్వం సత్కరించింది. వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన పోటీల్లో ఉత్సాహంగా మహిళలు పాల్గొనగా.. స్వయం సహాయక సంఘాల మహిళలు, జర్నలిస్టులకు డిజిటల్ కరెన్సీ రూపంలో చిరుకానుక ప్రభుత్వం అందించింది. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ స్వయంగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ప్రభుత్వ తరపున ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
“మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు అనుకూలమా..కాదా.. దోమలను నియంత్రించాలంటున్నారు.. మూసీ ప్రక్షాళన చేయొద్దంటున్నారు. నదుల బఫర్ జోన్లలో కట్టడాలకు అనుమతులు లేవు. బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపడితే తొలగించాలి. బఫర్ జోన్ పరిధిలోని ఇళ్లకు విలువ ఉండదు. ఇలాంటి అంశాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలి. నష్టపోయేవారికి ఏం ఇవ్వాలనే దానిపై చర్చించాలి. హైదరాబాద్‌కు కాలుష్యమే అతిపెద్ద సమస్య. హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం. కాలుష్యం నివారించే బాధ్యత మనందరిపై ఉంది. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడేలా తీర్చిదిద్దాలి. ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పరిశ్రమలను తరలించాలి. 2026 డిసెంబర్ నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు. పెట్రోల్, డీజిల్ ఆటోలనూ ఎలక్ట్రిక్‌గా మార్చుతాం. త్వరలోనే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం. మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. వారి కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. డ్వాక్రా సంఘాల ద్వారా రుణం అందిస్తున్నాం. గృహలక్షి పథకం ద్వారా సబ్సిడీకి గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. మహిళలు ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తున్నాం ” అంటూ రేవంత్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్‌ల్లోపు జిల్లాలకు తరలిస్తామని తెలిపారు. 100 శాతం ఈవీ బస్సులను నగరంలో తెస్తున్నామని, అసలు డిసెంబర్ 9లోపు డీజిల్ బస్సులు హైదరాబాద్‌లో కనిపించవని తెలిపారు. ఏసీ ఈవీ బస్సులు ప్రయణికుల కోసం తీసుకొస్తామని, ఈవీ వాహనాలు కొనుక్కుంటే జీరో ట్యాక్ విధిస్తామని రేవంత్ తెలిపారు. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నుంచి సంత్కారం అందుకున్నవారిలో టీవీ9 నుంచి దీప్తి, ప్రత్యూష, నేత్ర, సంధ్య, ప్రణిత, జ్యోతి ఉన్నారు.