Telangana: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇంకా తమకు స్వాతంత్య్ర ఫలాలు అందలేదన్న ఆవేదన అట్టడుగు వర్గాల ప్రజల్లో ఉందని తెలంగాణ సీఎ కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకల సభలో ఆయన ప్రసంగించారు. ఎంతో మంది త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని, ఆమహానీయుల గురించి నేటి తరం పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశాన్ని ఉన్మాద స్థితిలోకి మారుస్తున్నారని.. దీన్ని చూస్తూ ఊరుకోవడం సమంజసం కాదని పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
దేశం అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని.. ఈసమయంలో మేధావులు మేల్కోని దేశాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. అహింసా మార్గం ద్వారా ఎంతటి శక్తిమంతులనైనా జయించవచ్చని ప్రపంచ మానవాళికి సందేశమిచ్చిన మహాత్మాగాంధీ పుట్టిన గడ్డ భారతదేశమన్నారు. ఇప్పటికి దేశంలో పేదల ఆశలు నెరవేరని పరిస్థితులు ఉన్నాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర స్ఫూర్తితో కులం, మతం,జాతి అనే బేధం లేకుండా అందరినీ కలుపుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..