AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సమీక్షా.. ఏ అంశంపైనో తెలుసా..

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యానికి సోమ‌వారం మ‌ధ్యాహ్నం చేరుకున్నారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు, క‌రివేన‌, ఉదండాపూర్ కాల్వ‌ల విస్త‌ర‌ణ ప‌నులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు త‌ర‌లింపు ప‌నుల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్షించారు.

Sanjay Kasula
|

Updated on: May 01, 2023 | 3:55 PM

Share

అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర నూతన సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) వచ్చారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సెలవు ఉన్నప్పటికి సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నూతన సచివాలయానికి వచ్చారు. మొదట యాగశాలకు వెళ్లి… అక్కడ పూజల అనంతరం ఆరో అంతస్థులోని తన ఛాంబర్‌కు చేరుకున్నారు. తన కార్యాలయంలో సీఎం కేసీఆర్ నీటి పారుదల శాఖపై తొలి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలకు సంబంధించిన పనులపై సమీక్షిస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, వికారాబాద్‌కు వెళ్లే తాగునీటి కాల్వల నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు తాగు నీటి కోసం కృష్ణా జలాలను తరలించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ ఫైల్‌పై నిన్న సంతకం చేశారు కేసీఆర్. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఉదండాపూర్ జలాశయం నిర్మిస్తున్నారు… ఇక్కడి నుంచి రెండు కాల్వలు నిర్మించడం ద్వారా వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు తాగు నీటిని సరఫరా చేయనున్నారు. నిర్మాణ వ్యయం రూ. 5 వేల180 కోట్లుగా అంచనా వేశారు..

ఈ సమీక్ష సమావేశానికి జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసబర్వాల్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ కుమార్, రామకృష్ణారావు, నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్లు సమీక్షలో పాల్గొన్నారు.

చివరిసారి సీఎం కేసీఆర్ ఎప్పుడు సచివాలంయంకు వచ్చారంటే..

2014 జూన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, పాత భవనంలో సమస్యల కారణంగా సీఎం సచివాలయానికి వెళ్లలేదు. బేగంపేటలోని పాత సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన పనిచేశారు. జూన్ 2014 , నవంబర్ 2016 మధ్య క్యాబినెట్ సమావేశాలు, శాఖల సమీక్షా సమావేశాలను నిర్వహించడానికి సీఎం కేసీఆర్ కొన్ని సార్లు మాత్రమే సచివాలయాన్ని సందర్శించారు. 2016 నవంబర్‌లో బేగంపేటలో కొత్తగా నిర్మించిన “ప్రగతి భవన్”, సీఎం అధికారిక నివాసం- సీఎం క్యాంపు కార్యాలయానికిి మార్చేరు. అక్కడి నుంచే పాలన సాగించారు. చివరిసారిగా 2016 నవంబర్‌లో సచివాలయంలోకి సీఎం కేసీఆర్ వచ్చినట్లుగా సమాచారం.

పాత సచివాలయ భవనాన్ని కూల్చివేసి, ఆ స్థానంలో అన్ని ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాన్ని నిర్మించాలని సీఎం నిర్ణయించారు. కూల్చివేత పనులు జూలై 2020లో ప్రారంభమయ్యాయి. 2020 ఆగస్టులో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ ప్రజాసౌధాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్‌. అత్యాధునిక వసతులతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా సౌధాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు సింహ‌ల‌గ్న ముహుర్తంలో ప్రారంభించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం