CM KCR: రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి.. సీఎం కేసీఆర్ సూచన

దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రానీయకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు.

CM KCR: రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి.. సీఎం కేసీఆర్ సూచన
Cm Kcr
Follow us
Aravind B

|

Updated on: Jul 02, 2023 | 8:50 PM

దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రానీయకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాపాతం, ప్రాణహిత తదితర నదుల్లో ప్రవహిస్తున్న నీటి లభ్యత, రాష్ట్రంలోని రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ డిమాండు తదితర పరిస్థితుల పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీరు, సాగునీటికి లోటు రానీయకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి లభ్యతా వివరాలను సీఎం కేసీఆర్ కు ఆయా శాఖల ఉన్నతాధికారులు వివరించారు.

రాష్ట్రంలో తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని, ఈ దిశగా ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేయాలని, చుక్క చుక్క ఒడిసిపట్టి, ప్రజలకు నీటిని అందించాలని అధికారులకు సూచించారు. అదే సందర్భంలో ప్రాణహిత ద్వారా చేరుకుంటున్న జలాలను ఎప్పకప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తూ, మిడ్ మానేర్‎ను నింపాలని అన్నారు. అక్కడి నుంచి లోయర్ మానేర్ డ్యాంకు సగం నీళ్ళను, పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి సగం నీళ్ళను ఎత్తిపోయాలన్నారు. తద్వారా అటు కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యపేట దాకా, ఇటు ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే కురిసిన వానలకు పత్తి, తదితర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో, వర్షాభావ పరిస్థితుల్లో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకునే పరిస్థితులున్నాయని, అటువంటి పరిస్థితుల్లో విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా “కంటిన్ జెన్సీ ప్లాన్” సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రతి రోజు మినట్ టు మినట్ రిపోర్టును సీఎం కార్యాలయానికి ప్రతి రోజు ఉదయాన్నే అందజేయాలని కోరారు. ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి వ్యవసాయం, తాగునీరు, సాగునీరు పంపిణీకి సంబంధించి వస్తున్న రిపోర్టులను అనుసరించి సీఎం కార్యాలయం సంబంధిత ప్రాంతాల మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగునీరు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతోంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. సంక్షోభ సమయంలనే మనం పంటలు పండించి చూపించాలని సూచించారు. అన్ని వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ, ఎవరి పని వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలన్నారు. ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలని తెలిపారు. తాగునీటి అవసరాల కోసం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని ఆదేశించారు. కాగా ఉదయ సముద్రం, కోయిల్ సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి ఎద్దడి ఉన్నదని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్ కో కు ఇచ్చేలా విధివిధానాలు ఖరారు కోసం చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే పాలేరు రిజర్వాయర్ కు నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున, బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా నీరు మేడిగడ్డ రిజర్వాయర్ కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు 1 టిఎంసి నీటిని మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ళకు ఎత్తిపోసేలా మోటార్లను నిరంతరాయంగా, 24 గంటలు నడిపిస్తూనే ఉండాలని తెలిపారు. అలాగే సుందిళ్ళ నుంచి అంతే నీటిని మిడ్ మానేరు తరలించాలని.. అక్కడి నుంచి సగం నీటిని లోయర్ మానేరుకు, సగం నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని పేర్కొన్నారు. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యపేటలోని చివరి ఆయకట్టు చిన సీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..