Justice NV Ramana visit Yadadri : తెలంగాణకే తలమానికంగా నిర్మితమైన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సందర్శించనున్నారు. ఈ నెల 14న భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆయన వెంట తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్లనున్నారు. సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది పలు ఏర్పాట్లు చేస్తున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ రాక నేపథ్యంలో యాదాద్రిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిన్న తిరుమల నుంచి కుటుంబ సమేతంగా హైదరాబాదు చేరుకున్న జస్టిస్ రమణ రాజ్ భవన్ అతిథిగృహంలో బస చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యాక ఎన్వీ రమణ తొలిసారి తెలంగాణకు రావడం విశేషం.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పసిడి వర్ణ విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతున్నది. ప్రధానాలయానికి సరికొత్త హంగులతో కూడిన విద్యుత్ దీపాల అలంకరణ ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, పర్యవేక్షణలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లను శనివారం రాత్రి ట్రయల్ రన్ చేపట్టారు. విద్యుత్ కాంతులతో ఆలయ గోపురాలు, మండపాలు, జిగేల్ మనీ, స్వర్ణ కాంతులుగా వెలుగొందుతున్నాయి.. బెంగుళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థ ఆలయానికి బిగించిన విద్యుత్ దీపాలతో ఉత్తరం, తూర్పు, అష్టభుజ ప్రాకారాలు, మండపాలు, గోపురాలు, సాల హారాల్లోని విగ్రహాలకు విద్యుత్ దీపాలను రాత్రి సమయంలో ఆన్ చేశారు దీంతో ఆలయం ధగ ధగ మెరిసిపోతున్నది.