సింగరేణి మెడికల్ బోర్డులో అవకతవకలు తీవ్ర కలకలం సృష్టిస్తుంటే.. వాటిపై జరుగుతున్న విచారణ అంతకు మించి ఆసక్తిరేపుతోంది. కొత్తగూడెం ప్రధాని ఆస్పత్రిలో సీఐడీ తనిఖీలతో.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అసలు మెడికల్ మాఫియా వెనక ఎవరున్నారు? రెండునెలలుగా జరుగుతున్న విచారణలో ఏం తేలింది? అన్నదే చర్చనీయాంశంగా మారింది. సింగరేణి మెడికల్ బోర్డులో జరిగిన అవినీతిపై.. సీఐడీ విచారణ వేగవంతమైంది. సింగరేణి వ్యాప్తంగా లక్షలాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు గుప్పుమనడంతో.. ఇటీవల ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్. బలరాం, రాష్ట్ర ఏసీబీ అడిషనల్ డీజీపీ సీవీ ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన విచారణ బృందం.. జరిగిన అవకతవకలపై రెండు నెలలుగా ఆరా తీస్తోంది. తాజాగా, వరంగల్ ఏరియాలోని సీఐడీ విభాగం అధికారులు.. కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రుల్లో, ప్రధాన కార్యాలయంలో విచారణ జరిపారు. కీలకమైన ఫైల్స్‌ను పరిశీలించారు. గతంలో మెడికల్ బోర్డుకు అన్ ఫిట్ అయిన వారినుంచి వివరాలు సేకరించిన సీఐడీ అధికారులు.. వారు ఆన్ఫిట్ ఎలా అయ్యారు? ఈ విషయంలో పైరవీలు జరిగాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. వారికి ఉన్న వ్యాధులు ఏంటి? అనే అంశంపైనా అసలు విషయాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు. అయితే, ఈ విషయంలో విచారణ జరుగుతోందని తెలియడంతో.. కార్మిక నాయకులు, సింగరేణి ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది.
మెడికల్ బోర్డులో చక్రం తిప్పినవారు.. ఇప్పుడు తమజాతకం తిరగబడుతుందేమోనని భయపడుతున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వహయంలో సింగరేణిలో కీలకంగా వ్యహరించిన నాయకులు, ఉద్యోగులను సైతం సీఐడీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడా బ్యాచ్ అంతా భయంభయంగా కాలం వెల్లదీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సీఐడీ అధికారులు.. ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం ఏరియాల్లో ఏరియాలో కొంతమందిని విచారించినట్లు తెలుస్తోంది. అవకతవకలు బయటపడితే తమ పరిస్థితి ఏమిటనేది.. పైరవీ బ్యాచ్‌ను వెంటాడుతున్న భయం. తాము చేసిన సెటిల్మెంట్లన్నీ బయటకు వచ్చేస్తే శిక్ష తప్పదని తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. సీఐడీ అదికారులు పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తే.. ఈ మెడికల్ దాందాలో మరిన్ని అవకతవకలు వెలుగులోకి వస్తాయని పలువురు ఉద్యోగులు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే, దీనిపై పూర్తి వివరాలను బయటకు పొక్కనీయకుండా గోప్యతను ప్రదర్శిస్తున్నారు. అధికారులు సైతం.. తమకేమీ తెలియదన్నట్టుగానే ఉంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ విచారణలో ఎవరి జాతకాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..