
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన రాంబ్రహ్మం.. ఇటీవల నూతన గృహాన్ని నిర్మించుకున్నాడు. ఇదే సమయంలో చౌటుప్పల్‌లో తనకున్న రేకుల గదితో సహా 66 గజాల స్థలాన్ని అమ్మే ప్రయత్నం చేశాడు. ఏడాదిగా విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు నూతన ఇంటికి డబ్బులు చెల్లించాల్సిన వాయిదా నవంబర్‌లో ఉంది. దీంతో ఎలాగైనా ఇంటి స్థలాన్ని విక్రయించాలని రాంబ్రహ్మం ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా తన స్థలం వద్ద ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. స్థలం కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారు రూ.500 విలువైన కూపన్ ను కొనుగోలు చేసి లక్కీడ్రాలో పాల్గొనాలని జాతీయ రహదారి పక్కన ఫ్లెక్సీలు కట్టారు. దీంతో ఆ ఫ్లెక్సీలు చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
3000 కూపన్లను రాంబ్రహ్మం ముద్రించాడు.. కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు ఆ కూపన్స్‌ను కొనుగోలు చేసి తమ పూర్తి వివరాలను రాసి వేసేందుకు ఓ డబ్బాను కూడా ఏర్పాటు చేశాడు. ఈ లక్కీ డ్రాను నవంబర్ రెండో తేదీన తీసేందుకు ఏర్పాటు చేశాడు. స్థానిక మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం, గది విలువ రూ.16 లక్షలు ఉంటుందని.. ఏడాదిన్నర కాలంగా ఈ స్థలాన్ని అమ్మకానికి పెట్టినప్పటికీ సరైన ధర రాలేదని రాంబ్రహ్మం చెబుతున్నాడు. అందుకే ఇలాంటి కొత్త ఐడియాతో తన ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు సిద్ధమయ్యానని చెబుతున్నాడు. కూపన్స్, లక్కీ డ్రాను నవంబర్ రెండో తేదీన నిర్వహిస్తానని చెబుతున్నాడు. ఇంటి స్థలాన్ని అమ్మేందుకు లక్కీ డ్రా అనే పద్ధతి సరైనది కానప్పటికీ.. రాంబ్రహ్మం ఐడియాను మాత్రం అందరూ సూపర్ అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.