Hyderabad: దసరా రోజు నగరంలో మాంసం షాపులు తెరిచి ఉంటాయా..?
తెలంగాణలో పెద్ద పండుగకు వేళయింది. అక్టోబర్ 2న దసరా పండుగ వచ్చింది. అయితే అదే ఇప్పుడు పెద్ద సమస్య అయింది. ఎందుకంటే అదేరోజు గాంధీ జయంతి. దీంతో మాసం, మద్యం విక్రయాలకు అనుమతి ఉండదు. ఈ క్రమంలోనే మాంసం విక్రయాలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అన్ని మాంసం దుకాణాలు, కబేళాలు అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పూర్తిగా మూసివేయాలని అధికారులు ప్రకటించారు. గాంధీ జయంతి రోజు ప్రతి సంవత్సరం మద్యపాన నిషేధం, మాంసం విక్రయాల నిలిపివేత వంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈసారి కూడా అదే క్రమంలో కబేళాల్లో ఎద్దు, గొర్రె, మేకల వధను.. అలాగే మాంసం, బీఫ్ విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సెప్టెంబర్ 24న నిర్వహించిన GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, దాన్ని అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సంబంధిత విభాగాలు, అధికారులంతా ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఆయన ఆలోచనలు, ఆశయాలను స్మరించుకుంటూ శాంతి, అహింసా స్ఫూర్తిని గుర్తు చేసుకుంటారు. అలాంటి సందర్భంలో మాంసం విక్రయాలను నిలిపివేయడం ద్వారా ఆ రోజు ప్రత్యేకతను మరింత ప్రతిబింబించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక బృందాలు ఏర్పడి.. ఆ రోజు ఫీల్డ్‌లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించనున్నాయి. ఎక్కడైనా కబేళాలు లేదా మాంసం దుకాణాలు తెరిచి ఉంచితే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానికులు, వ్యాపారులు కూడా సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు.
అయితే ఈ ఏడాది అక్టోబర్ 2నే దసరా పండుగ కూడా వచ్చింది. ఇది తెలంగాణలో పెద్ద పండుగ.. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా జోష్ మాములుగా ఉండదు. అయితే ఆ రోజున గాంధీ జయంతి కాబట్టి.. మద్యం దుకాణాలతో పాటు మాంసం విక్రయాలపై కూడా నిషేధం ఉంటుంది.
