తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇదే పంచాయితీని తేల్చుకునేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం ప్రయత్నించింది. ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే అధికంగా సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఆ మాటలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని తెలంగాణ మంత్రులు పట్టుబట్టారు. ఖరీఫ్‌కు సంబంధించి తెలంగాణలో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణ పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ రాసింది మోడీ సర్కార్. తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణ లక్ష్యం పెంచినట్టు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 20.9.2021న రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. బియ్యం సేకరణ టార్గెట్ పెంచేందుకు ఆమోదం తెలిపినట్టు లేఖలో పేర్కొంది కేంద్ర సర్కార్.
మొత్తంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అదనపు బియ్యం సేకరణకు ఓకే చేప్పింది. మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహారశాఖ లేఖ ద్వారా సమాచారం అందించింది. అంటే.. 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోనుందని కేంద్రం వెల్లడించింది. కేంద్రం నుంచి క్లారిటీ రావడంతో 68.65 లక్షల టన్నుల వరిధన్యాన్ని సేకరించనుంది కేసీఆర్ సర్కార్.
ఇవి కూడా చదవండి: Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..