ESIC Hospital: తెలంగాణ వాసులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో ESIC హాస్పిటల్‌ నిర్మాణం.. ఎక్కడంటే!

తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంలో రాష్ట్రంలో మరో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, పెద్ద గోల్కొండ గ్రామంలోని రైకుంట గ్రామంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు.

ESIC Hospital: తెలంగాణ వాసులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో ESIC హాస్పిటల్‌ నిర్మాణం.. ఎక్కడంటే!

Updated on: Dec 16, 2025 | 12:54 PM

తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంలో రాష్ట్రంలో మరో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన ఈఎస్‌ఐసీ ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన 197వ సమావేశంలో, శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్‌ఐసీ ఆసుపత్రి నిర్మాణం కోసం రూ. 16.125 కోట్ల విలువైన భూసేకరణకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాకు ధన్యవాదాలు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, పెద్ద గోల్కొండ గ్రామంలోని రైకుంట గ్రామంలో ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1.32 లక్షల మందికి పైగా ఈఎస్‌ఐ బీమా ఉన్న కార్మికులు ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం, దాని పరిసర ప్రాంతాలలో, అలాగే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న భారీ పారిశ్రామికీకరణకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో ఇక్కడి కార్మికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ప్రాంతంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కేంద్ర నిర్ణయించింది, దీని వల్ల కార్మికులు, వారి కుటుంబాలు తమ నివాస స్థలాలకు సమీపంలోనే అవసరమైన వైద్య సేవలను పొందే అవకాశం లభిస్తుంది.

ఇక హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇప్పటికే ఈఎస్‌ఐ బీమా ఉన్న కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తోంది. ఇది కాకుండా, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈఎస్‌ఐ ఆసుపత్రులు నాచారం, రామచంద్రాపురం, సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్ ప్రాంతాలలో కార్మికులకు వైద్య సేవలను అందిస్తున్నాయి. ఇక ఇప్పుడు శంషాబాద్‌లో ఏర్పాటు చేయనున్న 100 పడకల ఈఎస్‌ఐసీ ఆసుపత్రిని కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే కార్మికులకు విలువైన వైద్య సేవలను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.