
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారిగా ఓ రాజకీయ పార్టీ ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న ఈ ట్రాన్స్‌జెండర్ గురించి ఇప్పుడు జనంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ రాజకీయ పార్టీ ఎవరు.? ఆ ట్రాన్స్‌జెండర్ ఎవరు.? ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బహుజన సమాజ్ పార్టీ 43 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం.. ఇప్పుడు రాష్ట్ర ప్రజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి చిత్తారపు పుష్పిత లయ అనే ట్రాన్స్‌జెండర్‌కు టికెట్ కేటాయించింది బీఎస్పీ పార్టీ. దీంతో ట్రాన్స్‌జెండర్లందరూ సంబరాలు జరుపుకున్నారు. కరీమాబాద్‌లో నివాసముంటున్న పుష్పిత లయ ఇప్పటికే బీఎస్పీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ టికెట్ దక్కడంతో సంబరాల్లో మునిగిపోయారు.
ఏళ్ల తరబడి హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న ట్రాన్స్‌జెండర్లు, రాజకీయ అస్తిత్వం కోసం ఆరాటపడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి తమకు స్థానిక సంస్థలు, లేదంటే ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి కూడా వారి వాదన, ఆవేదనను పట్టించుకోలేదు. బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్రాన్స్‌జెండర్‌కు వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ కేటాయించడంతో ఒక్కసారిగా ఆ పార్టీ జనంలో హాట్ టాపిక్‌గా మారింది.
పుష్పిత లయకు బీఎస్పీ టికెట్ రావడంతో ట్రాన్స్‌జెండర్లు సంబరాలు జరిపారు. బీఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. భూకబ్జాలకు అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా రాజకీయాలు చేస్తానని.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిపిస్తే ఒక సమర్థవంత పాలన అందిస్తానని.. వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానని, విద్యావంతురాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.