Telangana: మా బిడ్డని గాంధీ ఆస్పత్రి వైద్యులే చంపేశారు.. తల్లిదండ్రుల ఆరోపణ.. అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఛాతీలో కణితి సమస్యతో చేరిన బీఎస్సీ సెకండియర్ విద్యార్థిని పల్లవి గౌడ్.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించిందంటూ బంధువులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. రెండుసార్లు శస్త్రచికిత్స చేసినా తర్వాత యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఓ వైద్య విద్యార్థిని రెండు సర్జరీల తర్వాత ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మృతి చెందిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి గౌడ్ అనే విద్యార్థిని గత కొన్ని రోజులుగా ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీంతో ఆమెను మే 16న కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు, ఛాతీ భాగంలో ఒక కణితి ఉన్నట్లు గుర్తించారు. దీని తొలగింపు కోసం మే 17న వైద్యులు మొదటి ఆపరేషన్. అయితే తొలి సర్జరీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వైద్యులు ఆమెకు రెండోసారి కూడా శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది.
అంతర్గత రక్తస్రావమే శాపమా..?
రెండో శస్త్రచికిత్స చేసినప్పటికీ పల్లవి గౌడ్ శరీరంలో అంతర్గత రక్తస్రావం తీవ్రమైంది. వైద్యులు ఆ రక్తస్రావాన్ని అదుపు చేయలేకపోవడంతో పరిస్థితి విషమించి ఆమె కన్నుమూసింది. అనుభవం లేని జూనియర్ వైద్యులతో శస్త్రచికిత్సలు చేయించడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు పోయాయని, ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమేనని పల్లవి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత.. పోలీసుల దర్యాప్తు
పల్లవి మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని అప్పగించేందుకు ఆసుపత్రి యాజమాన్యం తొలుత నిరాకరించిందని బంధువులు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు నిర్లక్ష్యానికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకునే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని స్పష్టం చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. రోవైపు, బాధితుల ఆరోపణలపై గాంధీ ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉన్నతాధికారుల విచారణలో అసలు విషయాలు తెలియాల్సి ఉంది.
