KTR on Congress: హామీలు ఇచ్చే ముందు ఆలోచించరా..? కాంగ్రెస్ నేతల తీరుపై కేటీఆర్ ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండటంతో, అదే సాకుగా ట్విట్టర్ వేదికగా స్పందించారు కేటీఆర్.

KTR on Congress: హామీలు ఇచ్చే ముందు ఆలోచించరా..? కాంగ్రెస్ నేతల తీరుపై కేటీఆర్ ఫైర్
Ktr, Siddaramaiah

Updated on: Dec 19, 2023 | 11:57 AM

తెలంగాణలో ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఇక రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై.. అసలు ఆట మొదలైంది. తాజాగా, నేతలు పేల్చిన మాటల తూటాలు.. అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ యుద్ధానికి దిగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలు అమలు చేసి తీరాల్సిందే అంటూ బీఆర్‌ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అప్పులు ఉన్నాయంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సాకులు చెబుతున్నారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మాజీ మంత్రి కేటీఆర్ తనదైన శైలి సెటైర్లు విసిరారు.

తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండటంతో, అదే సాకుగా ట్విట్టర్ వేదికగా స్పందించారు కేటీఆర్. ‘‘ఎన్నికల హామీల అమలుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అన్నారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే జరుగుతుందా? విపరీతమైన ప్రకటనలు హామీలు ఇచ్చేముందు మీకు కనీసం ఆర్థిక పరిస్థతిపై పరిశోధన ప్రణాళిక ఉండదా?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ ఎక్స్ వేదికగా ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇదిలవుంటే ‘‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే సర్కార్ వద్ద సరియైన డబ్బులు లేవు’’ అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఉద్దేశించిన సమాధానం ఇచ్చారు అయితే ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కేటీఆర్‌.. అదే వీడియోను రీపోస్ట్‌ చేస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శల బాణం ఎక్కుపెట్టారు.

‘‘ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్దరామయ్య అంటున్నారు. అలా హామీల ప్రకటన ఇచ్చే ముందు ఆలోచన చేయరా? తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా?’’ అని కేటీఆర్ రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించారు. కాగా సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్యా ఖండించారు. బీజేపీ నేతలు అశ్వత్‌ నారాయణ, సి.టి.రవి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలు వక్రీకరించి ఎడిట్‌ చేసిన వీడియో ప్రసారం చేస్తున్నారని,. ఎన్నికల హామీల అమలులో అసమర్థతను అంగీకరించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2018లో హామీలు నెరవేర్చడంలో బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలమైందని సిద్దరామాయ్య ధ్వజమెత్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..