బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఎప్పుడు? జాతీయ స్థాయిలో కేసీఆర్ మార్క్ ఎన్నడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసిందా? క్రిస్మస్ తర్వాత బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ అమలు కానుందా? అంటే అవుననే అంటున్నారు గులాబీ శ్రేణులు. ఇటీవల పేరు మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే గులాబీ దళపతి కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. డిసెంబర్ 14న ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి తదితరులు హాజర్యారు.
ఈ సందర్భంగా పలువురు సీనియర్లు, రచయితలు, మేధావులు, ప్రముఖులు.. ఢిల్లీకి వచ్చి కేసీఆర్ కి తమ సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకుని పని చేసేలా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ ఉత్సాహంతో కేసీఆర్ మరో యాక్షన్ ప్లాన్ కి సిద్ధమయ్యారు. పలు రాష్ట్రాలలో బీఆర్ఎస్ కిసాన్ సమితి ప్రారంభించేలా యోచిస్తున్నారు.
ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో.. ముందుకెళ్లాలన్నది గులాబీ దళాధిపతి కేసీఆర్ ఆలోచన. ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్ ప్రారంభించి ఈ దిశగా ముందడుగు వేయాలన్నది మరో ఎత్తుగడ. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసుకుని.. క్రిస్మస్ పండగ తర్వాత ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలు వేగవంతం చేయాలని నిర్ణయించారు గులాబీ బాస్. ఇందులో భాగంగా.. ఉత్తర- తూర్పు- మధ్య భారతాలకు చెందిన పలు రాష్ట్రాల నుంచి ఎందరో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు తమ అనుచరులతో సహా వచ్చి కేసీఆర్ తో సంప్రదింపులు జరపడం. కేసీఆర్ కూడా ఆయా రాష్ట్రాల భౌగోళిక- సామాజిక- సాంస్కృతిక- స్థితిగతులపై వారితో చర్చించడం.. ఎలాంటి విధానాలు అవలంభించాలో వివరిచడం జరిగినట్టు సమాచారం.
ఈ నెలాఖరుకల్లా.. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కిసాన్ సెల్ ప్రారంభం కానున్నాయి. అంతే కాదు కన్నడ, ఒరియా, మరాఠా వంటి పలు భారతీయ భాషలకు చెందిన పలువురు రచయితలు, సాహిత్య వేత్తలు, పాటల రచయితలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ భావజాల వ్యాప్తి చేసేలా పాటలు రాయిస్తున్నారు కేసీఆర్.
క్రిస్మస్ తర్వాత బీఆర్ఎస్ కార్యక్రమాల ఉధృతి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు అధినేత కేసీఆర్. ఈ మేరకు ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్కే తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. జాతీయ స్థాయిలో తన వాణి వినిపిస్తూ.. దేశ ప్రజలను ఆకర్షించేలా తెలుస్తోంది. అంతే కాదు ఈ నెలాఖరున జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. భవిష్యత్ కార్యాచరణ, బీఆర్ఎస్ విధివిధానాలు ప్రకటించేలా ఒక ప్రణాళిక.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..