BRS: 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. కనివినీ ఎరగని స్థాయిలో బీఆర్‌ఎస్ ఖమ్మం సభకు ఏర్పాట్లు..
ఖమ్మంలో భారీ బహరింగ సభను బీఆర్‌ఎస్ పార్టీ కనివినీ ఎరగని స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు ఏర్పాట్లు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందు నుంచే భారీ కటౌట్లు, హోర్డింగ్ లతో ఖమ్మం గులాబిమయమైంది. ఈ నెల 18వ తేదీన జరగనున్న...

ఖమ్మంలో భారీ బహరింగ సభను బీఆర్‌ఎస్ పార్టీ కనివినీ ఎరగని స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు ఏర్పాట్లు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందు నుంచే భారీ కటౌట్లు, హోర్డింగ్ లతో ఖమ్మం గులాబిమయమైంది. ఈ నెల 18వ తేదీన జరగనున్న ఈ సభతో దేశ రాజకీయాలు మలుపుతిరుగుతాయని బీఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీగా అవవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఏర్పాట్లు భారీగా ఉండేలా చూసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే సభను ఏకంగా 100 ఎకరాల్లో దేశం నివ్వెరపోయేలా సభకు ప్లాన్ చేస్తుంది. కొత్త కలెక్టరేట్ వెనకాల ఉన్న స్థలంలో బహిరంగ సభ ఏర్పాట్లు రూపుదిద్దుకుంటున్నాయి. నలుగురు ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు హాజరవుతున్న సభకు 5లక్షల మంది జన సమీకరణ చేస్తున్నారు. ఖమ్మం సభతో జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుందని ఎంపీ గాయత్రి రవి, ఎమ్‌ఎల్‌సీ తాతా మధు తెలిపారు. ఖమ్మం సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని 10నియోజకవర్గాల నుంచి 3లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నారు. దీని కోసం బస్సులు, లారీలు, డిసీఎం సహా పలు వాహనాలను సమకూరుస్తున్నారు. భారీగా తరలి వచ్చే కార్యకర్తలు, ప్రజానికానికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా.. సభా ప్రాంగణం ప్రాంతంలో 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
15 వేల మంది VIP లకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారిగా కేటాయించిన ప్లేస్ లో పార్కింగ్ చేసేలా క్యూఆర్ కోడ్ ను డ్రైవర్లకు ఇస్తున్నారు. సభా వేదిక ఎదురుగా .. 20 వేల కుర్చీలు.. VIPల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, బయటా సుమారు అతిపెద్ద 50- LED స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చిన వారి కోసం పది లక్షల మంచి నీటి ప్యాకెట్లు, వెయ్యి మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారని నేతలు చెబుతున్నారు. సభకు హాజరయ్యే నలుగురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతల భారీ కటౌట్లు, హోర్డింగులు సభా ప్రాంగణం, ప్రధాన రహదారుల పక్కన ఖమ్మం నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఖమ్మం మొత్తం గులాబీ మయమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
