PM Modi: మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నాయకులు.. కేంద్రం రాష్ట్రానికి ఏం ఇచ్చిందంటూ సెటైర్లు

సికింద్రాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో భారాస ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

PM Modi: మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నాయకులు.. కేంద్రం రాష్ట్రానికి ఏం ఇచ్చిందంటూ సెటైర్లు
Brs Vs Bjp

Updated on: Apr 08, 2023 | 5:01 PM

సికింద్రాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మోదీకి లేదని..అధికారిక కార్యక్రమాల్లో ఆయన రాజకీయాలు మాట్లాడటం ఏంటని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అసలు తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో మోదీ చెప్పాలని.. విభజన చట్టంలోని హామీలను ఒక్కటైనా నెరవేర్చారా అని ధ్వజమెత్తారు. దేశానికి అత్యధిక ఆదాయం తెలంగాణ ఇస్తోందని.. ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడల్లా అబద్దాలు చెప్పి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి అవార్డులిస్తున్నారు కానీ నిధులివ్వడం లేదని దుయ్యబట్టారు. కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని ఇవ్వలేదని..ఇప్పుడు సింగరేణిని కూడా కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు.వందేభారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. అదాని అవినీతిపై మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని…అదాని వ్యవహారంపై జేపీసీ వేయమంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.

రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్న ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మీకు ఎందుకు సహకరించాలని ధ్వజమెత్తారు. మా డబ్బులు తీసుకెళ్లి గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్న మీకు మేం సహకరించాలా అంటూ విమర్శించారు. సింగరేణిలో నష్టాలు చూపి బొగ్గు గనులు వేలం వేసిన కుట్ర నిజం కాదా..రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ను రూ.1200 చేసినందుకు మీకు సహకరించాలా అంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు ప్రధానీ మోదీ రైలు ప్రారంభోత్సవానికి వచ్చి తెలంగాణపై విషం చిమ్మారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజుకి కూడా గుజరాత్ లో ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని..తెలంగాణ అభివృద్ధిని చూసి ప్రధాని ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ను చూసి మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆయనకు విజన్ లేదని చెప్పుకోవడానికి విజయాలు లేవని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి జరిగితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి జరుగుతోందని విమర్శించారు.

తెలంగాణకు వస్తున్న అవార్డులు భాజపా పాలిత రాష్ట్రాలకు అవార్డులు ఎందుకు రావట్లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కూడా రైళ్లు వెళ్లాలి కాబట్టే.. వందేభారత్‌ను ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారన్నారని ఆరోపించారు. సింగరేణిని ఎవరి కోసం ప్రైవేటీకరణ చేశారో అందరికీ తెలుసని..ప్రాజెక్టులకు జాతీయ హోదా లేదని చెబుతూనే అప్పర్‌భద్రకు ఎందుకు ఇచ్చారని.. తెలంగాణపై కేంద్రానికి ఎందుకింత కక్షని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..