Gajwel BRS: కేసీఆర్ ఇలాకాలో లుకలుకలు.. గజ్వేల్‌లో వంటేరు ప్రతాపరెడ్డి ఒంటెద్దు పోకడలు..?

అది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఎలాంటి వర్గాలు లేవు. కారు జోరుగా సాగిపోతుందని అందరూ భావించారు. కానీ తాజా పరిణామాలతో గులాబీ పార్టీలో ఆందోళన మొదలైందట. ఆ పార్టీకి చెందిన ఓ నేత.. సొంత పార్టీ నేతలపై బహిరంగంగా ఆరోపణలు చేయడం పార్టీని కలవరపెడుతోందట.

Gajwel BRS: కేసీఆర్ ఇలాకాలో లుకలుకలు.. గజ్వేల్‌లో వంటేరు ప్రతాపరెడ్డి ఒంటెద్దు పోకడలు..?
Vanteru Pratap Reddy

Edited By:

Updated on: Mar 24, 2024 | 10:09 PM

అది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఎలాంటి వర్గాలు లేవు. కారు జోరుగా సాగిపోతుందని అందరూ భావించారు. కానీ తాజా పరిణామాలతో గులాబీ పార్టీలో ఆందోళన మొదలైందట. ఆ పార్టీకి చెందిన ఓ నేత.. సొంత పార్టీ నేతలపై బహిరంగంగా ఆరోపణలు చేయడం పార్టీని కలవరపెడుతోందట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం ? సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నేత ఎవరు?

మెదక్ లోక్‌సభ టికెట్ ఆశించిన వాళ్లలో వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారట.. అయితే కొన్ని కారణాల వల్ల మెదక్ ఎంపీ టికెట్‌ను ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం జరిగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది మంత్రులను కూడా ప్రతాప్ రెడ్డి కలిసారని, బీఆర్ఎస్‌కి రాజీనామా చేయడమే తరువాయి అని, కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటారని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ ఈయన రాకను మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అడ్డుపడటంతోనే ప్రతాప్ రెడ్డి చేరిక ఆగిందనే చర్చ కూడా జరిగింది.

ఈ ఆరోపణలపై మొదట్లో స్పందించని వంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేశాక.. తొలిసారిగా తనపై వచ్చిన ఆరోపణలకు మీడియా ముఖంగా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదనీ ప్రకటన ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న అదే మీడియా సమావేశంలో తన సొంత పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ చేస్తూ, ఇద్దరు సీనియర్ లీడర్లపై ఫైర్ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న యాదవరెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇద్దరు నేతలు తనపై ఉన్నవీ లేనివీ చెప్పి కేసీఆర్ దగ్గర తన గ్రాఫ్ తగ్గించారని ఆరోపించారు. తనకు మెదక్ ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకున్నది వీళ్లిద్దరే అని, వాళ్ళను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలపై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దుమారాన్ని లేపాయట. సొంత పార్టీ నేతలపై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దుమారాన్ని లేపాయట.

వాస్తవానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతే మెదక్ ఎంపీ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించారు. ఆ సమావేశానికి వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా హాజరయ్యారు. తర్వాత మీడియా సమావేశం పెట్టిన వంటేరు ప్రతాప్ రెడ్డి.. సొంత పార్టీ నేతలపై ఇలా మాట్లాడటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారట. ప్రతాప్ రెడ్డి ఇలా సొంత పార్టీ నేతలపై నోరు జారడన్ని సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారట. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి గాని, ఇలా మీడియా సమావేశాలు పెట్టి, విమర్శలు చేయడం ఏంటంటూ మండిపడుతున్నారట. ఆయన తీరుతో పార్టీకే నష్టం కలుగుతోందని కేసీఆర్ ముందు వాపోతున్నారట. చూడాలి మరీ లోక్‌సభ ఎన్నికల వేళ అసంతృప్త నేతలు గులాబీ అధినేత ఎలా పరిష్కరిస్తారో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…