BRS: రజతోత్సవ మహాసభపై ఉత్కంఠ! ఉద్యమఖిల్లాల ఉమ్మడి వేదిక గులాబీ జెండాకు ఊపునిస్తుందా?

సవ్వాలే లేదు.. సభలు నిర్వహించడంలో ఇప్పటివరకు ఆ పార్టీని కొట్టినవారే లేరు. ఆవిర్భావం నుంచి ఉద్యమం దాకా.. ఉద్యమం నుంచి అధికారం దాకా.. భారీ బహిరంగసభలను సక్సెస్‌ చేయడంలో కారుపార్టీ ట్రాక్‌ రికార్డు వేరే లెవల్‌. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆవిర్భావ సంబరాలకు సిద్ధమవుతోంది. మరి, మరోసారి అక్కడే వేదికను సిద్ధం చేయడం వెనక కారణాలేంటి? ఎందుకు అదే ప్లేసును బీఆర్‌ఎస్‌ బాస్‌ ప్రిఫర్‌ చేస్తున్నారు?

BRS: రజతోత్సవ మహాసభపై ఉత్కంఠ! ఉద్యమఖిల్లాల ఉమ్మడి వేదిక గులాబీ జెండాకు ఊపునిస్తుందా?
Kcr

Edited By: Balaraju Goud

Updated on: Apr 14, 2025 | 8:45 PM

సవ్వాలే లేదు.. సభలు నిర్వహించడంలో ఇప్పటివరకు ఆ పార్టీని కొట్టినవారే లేరు. ఆవిర్భావం నుంచి ఉద్యమం దాకా.. ఉద్యమం నుంచి అధికారం దాకా.. భారీ బహిరంగసభలను సక్సెస్‌ చేయడంలో కారుపార్టీ ట్రాక్‌ రికార్డు వేరే లెవల్‌. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆవిర్భావ సంబరాలకు సిద్ధమవుతోంది. మరి, మరోసారి అక్కడే వేదికను సిద్ధం చేయడం వెనక కారణాలేంటి? ఎందుకు అదే ప్లేసును బీఆర్‌ఎస్‌ బాస్‌ ప్రిఫర్‌ చేస్తున్నారు? ఇదే ఇప్పుడ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

14ఏళ్ల ఉద్యమం.. పదేళ్ల అధికారం.. ఇప్పుడు ప్రతిపక్షంగా కదనోత్సాహం.. మొత్తంగా గులాబీసేన 25వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అధికార పార్టీగా పదేళ్లపాటు పండగలా ఆవిర్భావ వేడుకలు చేసుకున్న కారు పార్టీ.. ఇప్పుడు విపక్షంగా రజోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఉద్యమకాలం నుంచి సెంటిమెంటల్‌గా కలిసొచ్చిన వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలనే.. ఈ వేడుకలకు వేదికగా ఎంచుకున్న గులాబీపార్టీ.. అక్కడి నుంచే మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకుంది. ఉమ్మడి జిల్లాల మధ్య పొలిమేరల్లోనే మహాసభ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈసారి బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు… రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఉద్యమ పార్టీగా, అధికారపక్షంగా ఇంతకు ముందు ఒకెత్తు.. ఇప్పుడు ప్రతిపక్షంగా మరో ఎత్తు. అందులోనూ 25ఏళ్ల రజతోత్సవ పండగ. అందుకే, మహాసభ నిర్వహణ ద్వారా.. తెలంగాణ నలుమూలల నుంచి కార్యకర్తలను, ప్రజలను రప్పించాలని చూస్తోంది గులాబీ సేన. అధికారంలో ఉండి ఉంటే ఆ రేంజ్‌ వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంగా.. ఎన్నో అడ్డంకులను అధిగమించి అనుకున్న స్థాయిలో మహాసభను విజయవంతం చేయడం పెద్ద టాస్క్‌ అనే చెప్పాలి. అందుకే, బీఆర్‌ఎస్‌ సభ ఇప్పుడు అటు రాజకీయవర్గా్ల్లోనూ, ప్రజల్లోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే అన్ని జిల్లాలోనూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ హైకమాండ్‌… అధికారం ఉన్నా, లేకున్నా.. బహిరంగసభల నిర్వహణలో మనల్ని కొట్టేటోడు లేరన్నట్టుగా మనోధైర్యాన్ని పార్టీ శ్రేణుల్లో నింపే ప్రయత్నం చేస్తోంది.

ఆవిర్భావం నుంచి నేటి దాకా.. ఎన్నో ఒడిదుడుకుల్ని చూసిన బీఆర్‌ఎస్‌కు.. ఓటములు కొత్తకాకపోవచ్చు. కానీ, ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎదురైన వరుస ఓటములు.. పార్టీ శ్రేణుల్లో తీవ్రనిరాశను నింపాయనే చెప్పాలి. అప్పట్నుంచి అధినేత కేసీఆర్‌ అడపాదడపా ఫామ్‌హౌజ్‌కు వచ్చిన నాయకులను ఉద్దేశించి మాట్లాడటమే తప్ప… బయటకు మాత్రం రాలేదు. దీంతో ఏప్రిల్‌ 27న జరగబోయే పార్టీ 25 వసంతాల వేడుకలో ఆయన ఏం మాట్లాడబోతున్నారనే ఆసక్తి గులాబీ శ్రేణులతో పాటు, ప్రజలు, అటు ప్రత్యర్థివర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.

ఉద్యమ ఆరంభం నుంచి బీఆర్‌ఎస్‌కు వెన్నంటి నిలిచిన కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలంటే.. గులాబీసేనకు విపరీతమైన సెంటిమెంట్‌. ఏ ఉప ఎన్నికలు వచ్చినా.. ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా.. ఇక్కణ్నుంచే సింహనాదం పూరించేవారు కేసీఆర్‌. గతంలో ఇక్కడ బీఆర్‌ఎస్‌ నిర్వహించిన సభలు సక్సెస్‌ అయిన తీరు కూడా అదే రుజువు చేస్తున్నాయ్‌. అందుకే అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ… వరంగల్ – కరీంనగర్ జిల్లాల పొలిమేరల్లోనే ఈ మహా బహిరంగసభకు సన్నాహాలు చేస్తోంది బీఆర్‌ఎస్‌. దీని ఏర్పాటు మొదలు నిర్వహణవరకు.. అన్ని బాధ్యతలూ వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలకు అప్పగించిన అధినేత.. ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు.

NH 563, ఎల్కతుర్తి గ్రామ శివారులోని 1,213 ఎకరాల్లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ జరగనుంది. ఇందులో 159 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంటే.. మిగితా స్థలాన్ని పార్కింగ్, భోజనశాలలు, ఇతర సదుపాయాలను కల్పించేందుకు వాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలను, సాధారణ ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తోంది బీఆర్‌ఎస్ అధినాయకత్వం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండటంతో.. ఈ మహాసభ BRSకు మంచి బూస్టింగ్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెంటిమెంట్‌ ప్లేసులో సభ.. కొత్తగా వచ్చిన కష్టాలనుంచి గట్టెక్కిస్తుందా అన్నది కూడా ఆసక్తిరపుతోంది. మరో భారీ విజయానికి ఇక్కడే నాందివేసుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ శ్రేణులకు.. అధినేత ఏం చెబుతారో, తదనంతర రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..