BRS: రైతు భరోసాకు ఎగనామం పెట్టారు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్, హరీష్ రావు ఫైర్..

|

Oct 20, 2024 | 7:28 PM

ఆందోళనలతో తెలంగాణ అట్టుడుకుతుంది. శనివారం గ్రూప్ వన్ అభ్యర్థుల ధర్నాతో హైదరాబాద్‌ దద్దరిల్లితే.. ఆదివారం అన్నదాతలు, గులాబీ నేతల నిరసనలతో రాష్ట్రంలోని అన్నిమండలకేంద్రాలు హోరెత్తాయి. ఖరీఫ్‌లో రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్‌ నేతలు.

BRS: రైతు భరోసాకు ఎగనామం పెట్టారు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్, హరీష్ రావు ఫైర్..
Brs
Follow us on

ఖరీఫ్‌లో రైతు భరోసా ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తించింది బీఆర్ఎస్‌ పార్టీ. అన్నదాతలతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది. అన్ని మండలకేంద్రాల్లో జరిగిన ఆందోళనల్లో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్, కరీంనగర్ జిల్లాలో హరీశ్‌రావు నిరసనకు దిగారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టారంటూ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్, హరీష్ రావు ఫైర్ ఫైర్ అయ్యారు.

రంగారెడ్డిలో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుబంధు కూడా ఇవ్వలేమని రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందంటూ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సమయానికి రైతుబంధు ఇచ్చామని.. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు భరోసాకు ఎగనామం పెట్టిందంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ నయవంచక పాలన కొనసాగుతోందంటూ హరీష్‌ రావు విమర్శించారు. గ్యారెంటీల పేరిట గారడీలు చేశారన్నారు. రైతు బంధు ఇచ్చేదాక కాంగ్రెస్‌ నేతలను ఉరికించాలన్నారు. సీఎం ముమ్మాటికీ రైతు వ్యతిరేకి అని విమర్శించారు హరీష్‌రావు..

ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో ప్రధాన రహదారులపై గులాబీ నేతలు ధర్నాకు దిగారు. సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.

రైతు భరోసా హామీ అమలు చేయాలంటూ నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు బీఆర్ఎస్‌ నేతలు.

బీఆర్ఎస్‌ హయాంలో నాట్లు వేసేప్పుడే రైతు బంధు డబ్బులు పడేవన్నారు కేటీఆర్. ఇప్పుడు కోతలు ముగిసినా రైతు భరోసా ఇవ్వడంలేదన్నారు.

వీడియో చూడండి..

ధర్నాలు చేయడం హాస్యాస్పదం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

బీఆర్ఎస్ ఆందోళనలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెటైర్లు వేశారు. 10 ఏళ్ల పాలనలో రుణమాఫీ ఎగ్గొట్టిన బీఆర్ఎస్‌ ఇప్పుడు ధర్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం ఖరీఫ్‌లో రైతు భరోసా ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది బీఆర్ఎస్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..