
ప్రభుత్వ హాస్టల్‌లో సమస్యలు తీర్చమంటే క్షుద్రపూజలు నిర్వహించి చేతులు దులుపుకుందంటూ జనగామ జిల్లాలోని ఓ ప్రభుత్వ గురుకుల పాఠశాల బాలికలు రోడ్డెక్కారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఆ బాలికల సమస్య తెలుసుకోవడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే ముందు వాళ్ల సమస్యల గోడు వెళ్లబోసుకున్నారు. హాస్టల్ పరిసరాల్లో పూజలు నిర్వహించిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులోని ST బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది. ఈ గురుకుల పాఠశాల బాలికలు అంతా రోడ్డెక్కారు. మా సమస్యలు పాతరపెట్టి హాస్టల్ వార్డెన్ క్షుద్రపూజలు నిర్వహిస్తుందని ఆరోపించారు. హాస్టల్‌లో సరైన వసతులు లేవని, సమయానికి అన్నం పెట్టడం లేదని ఆరోపిస్తూ విద్యార్థినులు పాలకుర్తి – ఘనపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బీష్మించుకొని కూర్చున్నారు. స్థానిక పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన విద్యార్థులు వినకపోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ధర్నా చేస్తున్న విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు లేక తమకు ఇబ్బంది అవుతుందని బాలికలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ రేణుక రాథోడ్‌పై విద్యార్థులు సంచలన ఆరోపణలు చేశారు. రెండు రోజుల కింద పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్ క్షుద్రపూజలు చేయించి క్లాస్ రూమ్‌లు, పాఠశాల ప్రహరీ చుట్టూ పసుపు నీళ్లు చెల్లించారని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్ పరిసరాల్లో పూజలు నిర్వహించనప్పటి నుంచి మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదు అందుకున్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులు తెలిపిన విషయాన్ని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వివరించారు. వెంటనే ఘటనపై విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే మీకు అండగా ఉంటానని, ఎవరూ భయాందోళన చెంది అధైర్యపడొద్దని విద్యార్థులకు భరోసానిచ్చారు. మీ సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రతి నెలకు ఒకసారి పాఠశాలకు వచ్చి విజిట్ చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.