
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పారు. తప్పు చేసిన వారే.. పెద్ద, పెద్ద హోర్డింగ్ పెట్టుకుంటున్నారన్న ఆయన.. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. సీబీఐ వాళ్లు చాయి, బిస్కట్ తినడానికి రావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకుంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్నారు. తమకే టికెట్ అన్నట్లు ప్రచారం చేసుకోడం కూడా తగదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తప్పు చేసిన బీఆర్ఎస్ నేతలు జైలుకు పోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.
సీబీఐ విచారణపై సీపీఐ నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై జరుగుతున్న సీబీఐ విచారణనిు లైవ్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేయటాన్ని నారాయణ ఖండించారు. న్యాయస్థానాలు సైతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల చర్చలు ప్రత్యక్ష ప్రసారం చేయగా లేనిది సీబీఐ విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయటంలో ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. కవిత విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని సీపీఐ నారాయణ పట్టుబట్టారు.
మరోవైపు.. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లోనే సీబీఐ డీఐజీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. విచారణలో సీబీఐ అధికారులు కవితకు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అడిగే ప్రశ్నలకు ఆమె ఏం వివరణ ఇవ్వబోతుందనేది ఇప్పుడు టాక్ టాపిక్ గా మారింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చడం, ఆ తర్వాత సీబీఐ సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేయడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెంచేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం