Nizamabad Municipal Election Result: రెండోసారి కమలం చేజారిన ఇందూరు పీఠం.. మజ్లిస్‌తో కలిసి మేజిక్ ఫిగర్..!

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా రెండుసార్లు సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం అయింది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

Nizamabad Municipal Election Result: రెండోసారి కమలం చేజారిన ఇందూరు పీఠం.. మజ్లిస్‌తో కలిసి మేజిక్ ఫిగర్..!
Mp Aravind, Mahesh Kumar Goud

Edited By:

Updated on: Feb 15, 2026 | 4:16 PM

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా రెండుసార్లు సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం అయింది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అధికారికంగా ప్రకటన రావడమే మిగిలింది. అయితే ఈ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ – బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో చివరికి అధికార కాంగ్రెస్ పై చేయి సాధించింది. ఆ పార్టీ నుండి మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇపుడు కీలంగా మారింది.

నిజామాబాద్ మున్సి1పల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు కాక రేపింది. హోరా హోరీగా సాగిన ఈ ప్రక్రియలో చివరికి మేయర్ పీఠం హస్తగతం అయింది. మరోసారి మేయర్ పీఠం బీజేపీ చేజారింది. సోమవారం (ఫిబ్రవరి 16) మేయర్ ఎన్నిక అధికారికంగా జరగనున్న నేపధ్యంలో రెండూ పార్టీల బాలా బలాల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్ లు ఉండగా బీజేపీ 28 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.బీజేపీకి మరో మూడు ఎక్స్ అఫిషియో స్థానాలు ఉన్నాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెలే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెలే పైడి రాకేష్ రెడ్డి ఓట్లతో కలిపి బీజేపీ సంఖ్య 31కి చేరింది. కానీ బీజేపీ కంటే రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి.

కాంగ్రెస్ సంఖ్యను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ స్వతహాగా గెలిచిన స్థానాలు 17 కాగా, ఎంఐఎం గెలిచిన 14 స్థానాలు తన ఖాతాలో కలుపుకుంది. బీఆర్ఎస్ నుండి గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా కాంగ్రెస్ శిబిరంలో చేరారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీకి రెండు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా, రూరల్ ఎమ్మెలే భూపతి రెడ్డిలు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం సంఖ్య 34 కు చేరింది. మేజిక్ ఫిగర్ దాటి, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయింది. ఇప్పటికే కాంగ్రెస్ – ఎంఐఎం, బీఆర్ఎస్ అభ్యర్థులు హైదరాబాద్ క్యాంపులో ఉన్నారు. సోమవారం నేరుగా మేయర్ ఓటింగ్ కోసం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారని తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి విషయంలో మంతనాలు కొనసాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ ఈ విషయంలో కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణలు లెక్కిస్తున్నారు. ప్రధానంగా నాలుగు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మున్నూరు కాపు సామాజికవర్గం నుండి పంచరెడ్డి లలిత, గౌడ సామాజికవర్గం నుండి పూజిత గౌడ్ లతో పాటు మరో ఇద్దరు అరుంధతి, ఉమారాణి పేర్లను పరిశీలిస్తున్నారు

ఇదిలా ఉంటే వరుసగా రెండు సార్లు బీజేపీ పార్టీకి మేయర్ పదవి దక్కినట్లే దక్కి చేజారిపోవటం చర్చనీయాంశంగా మారింది. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీకి 28 సీట్లు దక్కగా, అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ – ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోగా, ఈసారి కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠం బీజేపీకి అందని ద్రాక్షలా మారింది. ఆ పార్టీకి 28 సీట్ల ఫిగర్ అచ్చి రావడం లేదా అనే చర్చ నడుస్తుంది. కాకపోతే పరుసగా రెండు పర్యాయాలు ఆ పార్టీకి 28 సీట్లే రావడమేంటి?, రెండు సార్లు సేమ్ సీన్ రిపీట్ అవ్వడమేంటి అని చర్చించుకుంటున్నారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన మిగతా అన్ని రాజకీయ పార్టీల కన్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా అధికారం దక్కకపోవడం పట్ల బీజేపీ తీవ్రంగా మదన పడుతుంది. ఇందులో భాగంగానే ఎంఐఎం తో కలిసి ఇతర పార్టీలు రెండు సార్లు మేయర్ పీఠం దక్కించుకోవడంపై ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తిరస్కరించిన పార్టీలు మేయర్ పదవులను గద్దల్లా తన్నుకుపోతున్నాయని ధర్మపురి మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దిగజారుతున్నారని ఆరోపించారు. ఒక్క స్థానంలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థిని పోలీసులతో కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్ చేయించిందని సంచలన వీడియోను సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. దానిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.  మొత్తం మీద నిజామాబాద్ మేయర్ పీఠం మరోసారి బీజేపీ చేజారిపోయింది. పీఠం దక్కినట్లే దక్కి రెండు సార్లు మిస్ అవడం కాషాయదళం జీర్ణించుకోలేక పోతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..