
కేసీఆర్ ఎదురుపడితే నమస్కారం పెట్టే సంస్కారం తనకు ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. టీబీజేపీ అధ్యక్ష పదవైనా.. సీఎం పోస్ట్ అయినా ప్రజలు, పార్టీ ఇస్తేనే దక్కుతుందన్నారు. సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తా బీజేపీకి ఉన్నప్పుడు.. బీఆర్‌ఎస్ తో విలీనం తమకెందుకన్నారు ఈటల. హైడ్రా పేరుతో పేదలను రేవంత్ టచ్ చేశారని.. అదే కాంగ్రెస్ పతనానికి పునాది వేసిందన్నారు. మరో 20ఏళ్లపాటు కాంగ్రెస్‌కి ఓటేసే పరిస్థితి లేదంటూ ఈటల కామెంట్స్ చేశారు. ఇలా.. కాళేశ్వరంపై విచారణ, బీఆర్‌ఎస్-కాంగ్రెస్ నేతలతో తన రిలేషన్ గురించి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్- TV9 క్రాస్ ఫైర్‌లో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఫామ్ హౌస్‌లో తాను హరీష్ రావును కలిశాననే ప్రచారం ఆవాస్తవమని ఈటల రాజేందర్ ఖండించారు. రాజకీయంగా కేసీఆర్‌ను బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉంటానంటూ ఈటల పేర్కొన్నారు. భూలోకంలో తనకు నరకాన్ని చూపిన వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్‌లో గత స్మృతులను ఈటల గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ, ఎప్పటికీ కేసీఆర్‌ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తానన్నారు. తనకు అన్ని పార్టీల్లోనూ ఫ్రెండ్స్ ఉన్నారని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లోనూ మిత్రులున్నారని.. రేవంత్ రెడ్డి కూడా తనకు మంచి మిత్రుడేనని ఈటల స్పష్టం చేశారు.
కాళేశ్వరంపై ప్రతీ చిన్న అంశం నాటి కేబినెట్‌లో చర్చించామని.. ఇప్పుడు తుమ్మల ఎందుకు మాటమార్చారో తెలియదంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్, నేను కమిషన్ ముందు ఒక్కటే చెప్పామనడం సరికాదన్నారు. కుంగిన పిల్లర్లు బాగు చేయించకుండా రైతుల నోట్లో మట్టి కొట్టొద్దన్నారు. మేడిగడ్డను రిపేర్ చేయించి, రైతులకు భరోసా కల్పించాలని కోరుతున్నానన్నారు.
పార్టీలో తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారనేది అనుమానమేనని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజలు అనుకుంటే నాకు పదవొస్తుంది,హైకమాండ్ ఇస్తుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనన్నది గాలి ముచ్చట అంటూ పేర్కొన్నారు. రేవంత్ రావడంతోనే కట్టడం వదిలేసి, కూల్చడం మొదలెట్టారంటూ పేర్కొన్నారు. హైడ్రా పేరిట పేదల బతుకులను ఆగం చేశారని.. 40ఏళ్ల క్రితం పట్టా ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చేస్తే ఎలా? అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..