
తెలంగాణలో పదిహేడుకు 17 ఎంపీ సీట్లు గెలవాలన్నదే తమ లక్ష్యం అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బూత్‌స్థాయి నేతల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ చేస్తే.. అంత త్వరగా రీజినల్ రింగ్ రోడ్డు పూర్తవుతుందన్నారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవకుండా ఎంఐఎం కుట్రలు చేసిందంటూ.. సికింద్రాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ముస్లింలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటెయ్యాలని ఫత్వా జారీ చేయించిందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సారి అసదుద్దీన్ ఓవైసీని ఓడించి హైదరాబాద్ సీటును కూడా గెలుస్తామన్నారు కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 20 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో 5 యాత్రలు ప్రారంభమవుతాయని, వీటిని విజయవంతం చేయాల కేడర్‌ను కోరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సమావేశంలో.. మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ దాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా కొమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం. మల్లన్న భక్తుల కోసం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో రైల్వే హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొండ ప్రాంతంలో ఉండి, సాంకేతికంగా ఇబ్బందులున్నా ప్రధాని మోదీ ఆదేశాలతో ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణం చేస్తున్నామన్నారు.
దక్షిణ మధ్య రైల్వేకు కాంగ్రెస్ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో 250 కోట్ల కేటాయింపులు ఉంటే, ఇప్పుడవి 6 వేల కోట్లకు పెంచామని తెలిపారు. 730 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. 26 వేల కోట్లతో రీజినల్ రింగురోడ్డు నిర్మాణం చేస్తున్నామని దీనికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూ సేకరణ చేస్తే అంత త్వరగా RRR నిర్మాణం పూర్తవుతుందన్నారు కిషన్ రెడ్డి. రీజినల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రింగ్ రైల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు కిషన్ రెడ్డి. అత్యాధునిక వసతులతో రింగ్ రైల్ నిర్మాణం ఉంటుందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..