CM Kcr: బీజేపీ పాలనలో దేశ ప్రజల బతుకులు ఆగమైపోతున్నాయని, బీజేపీ ముక్త్ భారత్ కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందకోసం ప్రతీ ఒక్కరూ సన్నద్ధం కావాలని, 2024 ఎన్నికల్లోనే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు కేసీఆర్. దేశ ప్రజలను దగా చేస్తూ, మోసం చేస్తూ అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం.. అడ్డగోలుగా ధరలు పెంచుతూ పేదలను మరింత పేదలుగా మార్చేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లాల్లో కలెక్టరేట్, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, శ్మశానాల మీద పన్ను, పాల మీద జీఎస్టీ, చేనేత కార్మికులపై జీఎస్టీ, ఇలా అన్ని రకాలుగా ధరలు పెంచుతూ పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అదే సమయంలో ఎన్‌పీఏల పేరు మీద లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పెద్దలకు దోచిపెడుతూ భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ అంటేనే అవినీతి అయిపోయిందన్నారు.
గుజరాత్ గోల్‌మాల్ మోడల్..
గాంధీ పుట్టిన రాష్ట్రం గుజరాత్‌లో మద్యపానం నిషేధం అని ప్రకటించి.. అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. కల్తీ మద్యం కారణంగా గుజరాత్‌లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోగా.. ఎలాంటి విచారణ జరిపించడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో జరిగే ఏ ఒక్క మంచి కూడా ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో లేదన్నారు. ‘24 గంటల కరెంట్ లేదు. 2 వేల రూపాయల పెన్షన్ లేదు. పేదలకు ఆరోగ్య శ్రీ లాంటి పథకమూ లేదు. దోపిడీ తప్ప గుజరాత్‌లో ఏమీ లేదు.’ అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. ఇదే సమయంలో బండి సంజయ్.. అమిత్ షా చెప్పులు మోయడంపై తీవ్రంగా స్పందించారు సీఎం కేసీఆర్. గుజరాత్ నుంచి వచ్చే దోపిడి దొంగల బూట్లు మోసే వారు మనవద్ద ఉన్నారంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను వారి బానిస మనస్తత్వంతో గుజరాత్ దొంగల పాదాక్రాంతం చేయాలుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
26 రాష్ట్రాల రైతులతో సమావేశం..
తనను కలవడానికి దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల రైతులు వచ్చారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అంతటా పర్యటించి రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గురించి తెలుసుకున్నారని, తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు నేతలు కోరారని సీఎం కేసీఆర్ తెలిపారు. గుజరాత్ మోడల్ అని చెప్పి దగా చేస్తున్నారని ప్రధాని మోదీ తీరును తూర్పారబట్టారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. అందుకే వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని యోచిస్తోందన్నారు. ఆ ప్రయత్నానికి చెక్ పెట్టి మోదీకే మనం మీటర్ పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం. గోల్‌మాల్ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం. దేశంలో రైతులు వినియోగించే విద్యుత్ కేవలం 20.08 శాతం మాత్రమేనని అన్నారు. కేంద్రంలో బీజేపీ పోయి, రైతుల ప్రభుత్వం రాబోతోందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..