KTR – Bandi Sanjay: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం..? ఇరు పార్టీల ముఖ్య నేతలు ఏమన్నారంటే..

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో సీఎం రేవంత్‌పై తనకు నమ్మకం ఉందన్నారు. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి...

KTR - Bandi Sanjay: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం..? ఇరు పార్టీల ముఖ్య నేతలు ఏమన్నారంటే..
KTR - Bandi Sanjay

Updated on: Aug 12, 2024 | 12:33 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీ కేడర్‌కు ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. తెలంగాణలో అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్‌ భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌ చేసిన బండి సంజయ్.. సీఎం రేవంత్‌ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని.. ఆయన కేటీఆర్‌ను కచ్చితంగా జైలులో వేస్తారని అన్నారు. ఒకవేళ కేటీఆర్‌ను జైల్లో పెట్టకపోతే బీజేపీ నుంచి పెద్ద యుద్ధమే ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనను తమ పార్టీ కేడర్‌ ఎప్పటికీ మరిచిపోదన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తే బీజేపీనే ఇప్పించిదనే ప్రచారం చేస్తారని అన్నారు.

మేడిగడ్డ మీద వచ్చిన ఫిర్యాదును NDSA పరిశీలిస్తుందన్నారు. సుంకిశాలపై కూడా ఫిర్యాదు వస్తే కచ్చితంగా కేంద్రం పరిశీలిస్తుందని బండి సంజయ్ తెలిపారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు కాంగ్రెస్‌ పోస్టింగ్‌ ఇవ్వడం లేదని… బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారికే మళ్లీ పోస్టింగ్‌ ఇస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు సపోర్ట్ చేసిన వాళ్ళే మంచి పోస్టింగులు తెచ్చుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్న బండి సంజయ్… క్షేత్రస్థాయిలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలే బీజేపీ కోసం ప్రచారం చేస్తారని అభిప్రాయపడ్డారు. కేంద్రమే నిధులు ఇస్తుందని మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తెలుసన్నారు. కేంద్రం నిధులు ఇస్తుందని హరీష్ రావు చెప్పారు కాబట్టే.. ఆయనను తాను మంచి నాయకుడని అన్నానని వివరించారు. సొంత వ్యవహారాల కోసమే విదేశాలకు అప్పుడు బీఆర్‌ఎస్‌ పెద్దలు..ఇప్పుడు సీఎం రేవంత్ వెళ్లారని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారో తనకు తెలియదని.. దీనిపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

 బీఆర్‌ఎస్‌ విలీనం అంటూ దుష్ప్రచారం: కేటీఆర్‌

మరో పార్టీలో బీఆర్‌ఎస్‌ విలీనం అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవాళ్లు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేదంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..