Telangana: నీళ్లు – నిప్పులు.. ప్రాజెక్టుల పేరుతో అవినీతి వరద పారిందా?

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది . వేల కోట్ల కుంభకోణం జరిగిందని అధికారపార్టీ కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. వాస్తవాలు దాచిపెట్టి తమపైకుట్రలకు తెరతీశారంటోంది బీఆర్ఎస్‌. అటు కేంద్రంతో చర్చించకుండానే సరైన అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారంటూ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చింది కేంద్రం. అయితే తెలంగాణ వరప్రదాయని అయిన బాహుబలి ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో వాస్తవాలను చూపించి ప్రత్యర్ధుల కళ్లు తెరిపిస్తామంటూ ఛలో మేడిగడ్డ అంటూ ప్రాజెక్టు బాటపట్టింది గులాబీ పార్టీ.

Telangana: నీళ్లు - నిప్పులు.. ప్రాజెక్టుల పేరుతో అవినీతి వరద పారిందా?
Big News Big Debate

Updated on: Mar 01, 2024 | 7:34 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్​, బీఆర్ఎస్​ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌ నేడు చలో మేడిగడ్డకు పిలుపు ఇచ్చింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులు, నిపుణులు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు చేరుకున్నారు. నిజాలను నిగ్గు తేల్చేందుకు.. మేడిగడ్డకు వచ్చామంటోంది బీఆర్ఎస్‌. రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా.. వర్షాకాలంలో వరద వస్తే ప్రాజెక్టు కొట్టుకపోవాలన్న కుట్రతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌.

అటు లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నిరివ్వలేదంటోంది కాంగ్రెస్‌. కమిషన్ల కోసమే కట్టిన ప్రాజెక్టుపై విచారణ జరిపిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్‌. ఇప్పటికే విజిలెన్స్ నివేదిక వచ్చిందని.. న్యాయ సలహాలు తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కూడా విచారణ జరుపుతోందన్నారు.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోపాలున్నాయంటోంది కేంద్రం. ఇన్విస్టిమంట్ క్లియరెన్స్‌లు లేవని.. పైగా జియలాజికల్‌ సర్వే కూడా చేయకుండా నిర్మాణం చేశారంటోంది కేంద్రంలోని నిపుణులు. ప్రాజెక్టు విషయంలో 20 రకాల వివరాలు అడిగితే గత ప్రభుత్వంతో పాటు.. కొత్త ప్రభుత్వం కూడా సమాచారం ఇవ్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ శ్రీరామ్‌ వెదిరే.

మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌కు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నిపార్టీలకు అస్త్రంగా మారింది. మరి ఇందులో ఎవరికి ఓట్ల వరద పారిస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…