
తెలంగాణలో పథకాల నుంచి ప్రచారం దాకా అన్నీ కన్నడమయం అయ్యాయి. కర్నాటక ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ అక్కడి గ్యారెంటీ ఫార్మూలతోనే ఇక్కడా విజయం సాధించాలనుకుంటోంది. పథకాలు అదనంగా ఒకటి యాడ్ చేసి సేమ్ టు సేమ్ హామీలతో జనాల్లోకి వచ్చింది. అయితే 6 నెలల్లోనే కర్నాటకలో అక్కడి ప్రభుత్వం హామీల అమల్లో ఘోరంగా విఫలమైందని ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ వస్తే కర్నాటక తరహాలోనే కరెంట్ కోతలుంటాయంటోంది బీఆర్ఎస్. గ్యారెంటీల పేరుతో ఇక్కడ కూడా మోసం చేస్తారంటోంది బీజేపీ. ఓటమి భయంతోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో కన్నడ ఫీవర్ నడుస్తోంది.. ఎన్నికల బరిలో ఉన్న ప్రధానపార్టీలన్నీ కూడా కర్నాటక జపం అందుకున్నాయి. అక్కడ అమలు అవుతున్న గ్యారెంటీలు, కరెంట్ కట్‌లపైనే చర్చ పెడుతున్నాయి ప్రధాన పార్టీలు. వందశాతం హామీలు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ అంటుంటే.. 6 నెలలకే అన్నీ పథకాలకు ఎగనామం పెట్టారంటున్నాయి ప్రత్యర్ధి పార్టీలు.
రైతులకు ఉచిత విద్యుత్ అంశాన్ని ప్రధానాస్త్రంగా తీసుకుంది బీఆర్ఎస్. కర్నాటకలో రైతులకు 5గంటలకు మించి కరెంట్ సరఫరా కావడం లేదని.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలోనూ 3గంటలకు మించి విద్యుత్ రాదంటున్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. అధికారంలోకి వచ్చిన వెంటనే 24గంటలు కరెంట్ ఇచ్చితీరుతామంటోంది హస్తం పార్టీ.
అటు 6 గ్యారెంటీలపైనా రాజకీయ రచ్చ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కర్నాటకలో హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు బీజేపీ నేతలు. తెలంగాణలోనూ ఓటేసి మోసపోవద్దంటూ కర్నాటక బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడకు వచ్చి మరీ ప్రచారం చేస్తున్నారు. పథకాల సంగతి పక్కనపెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6గురు సీఎంలు మారడం పక్కా అంటున్నారు మంత్రి కేటీఆర్. హస్తం పార్టీలో 11 మంది నేతలు సీఎం పదవి కోసం పోటీపడుతున్నారన్నారు.
ప్రత్యర్ధుల నుంచి వస్తున్న విమర్శలతో తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలపై భరోసా ఇవ్వడానికి కర్నాటక మంత్రులు రంగంలో దిగారు. కేంద్రం సహకరించకపోయినా తమ రాష్ట్రంలో పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీలను అమలుచేస్తున్నామని.. ఇక్కడ కూడా అమలు చేయడం ఖాయమని భరోసా ఇస్తున్నారు కన్నడ నేతలు.
రాజకీయ పార్టీల మధ్య రచ్చ నడుస్తుండగానే కర్నాటక రైతులు రంగంలో దిగారు. తమకు విద్యుత్ సరఫరా సరిగా లేదని.. హైదరాబాద్‌లో ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ ఈసీని అనుమతి కోరారు. దీనిపై ఈసీ నిరాకరించింది. దీని వెనక కూడా రాజకీయ కుట్ర కోణం ఉందంటోంది కాంగ్రెస్. మొత్తానికి తెలంగాణలో రాజకీయాలు కర్నాటక చుట్టూ తిరుగుతున్నాయి. కర్నాటక నినాదం ఎవరికి వరంగా మారబోతుంది? మరెవరికి నష్టం చేయబోతుంది?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..