Big Fish Caught: సాధారణంగా చిన్నపాటి జలాశయంలో, చెరువుల్లో ఐదు నుంచి పది కిలోల వరకు బరువు ఉన్న చేపలు దొరకడమే చాలా అరుదు. అలాంటిది ఏకంగా 30 కిలోల బరువు ఉన్న చేప దొరికితే? చేపలు పట్టే మత్స్యకారుల్లో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వారు ఎగిరి గంతేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు అన్ని చెరువులు, జలాశయాల్లోనూ చేపలు ఎక్కువలో ఎక్కువగా 15 కిలోల వరకు బరువు పెరుగుతాయి. కానీ ఈ జలాశయంలో మాత్రం ఊహించని రీతిలో భారీ చేప దొరికింది. భారీ చేప వలకు చెక్కిడంతో మత్స్యకారులకు కాసుల పంట పండింది.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణా కలాన్ శివారులో అలీసాగర్ జలాశయం ఉంది. ఈ జలాశయంలో శనివారం నాడు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో వారు వేసిన వలకు 30 కిలోల చేప చిక్కింది. అది చూసి మత్స్యకారులు షాక్ అయ్యారు. ఇంత పెద్ద చేప దొరకడంతో వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. వలకు చిక్కిన భారీ చేపను చూసి మురిసిపోయారు. అయితే, ఇది ‘బొచ్చ’ రకానికి చెందినదని మత్స్యకారులు చెబుతున్నారు. ఆ భారీ చేపను చేతిలో పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. మరొకరు తన భుజంపై పట్టుకుని బాహుబలి మాదిరిగా ఫోజులు ఇచ్చాడు.
ఇదిలాంటే.. ఈ జలాశయంలో దాదాపు అన్నీ 5 నుంచి 10 కేజీల మధ్య బరువున్న చేపలు ఉంటాయన్నారు మత్స్యకారులు. ఇప్పటి వరకు దొరికిన చేపలు కూడా అంతే సైజ్‌లో ఉండేవన్నారు. ఈ జలాశయంలో ఇలాంటి భారీ చేపలు చాలా అరుదుగా దొరుకుతాయని పేర్కొన్నారు. కాగా, తొలిసారి భారీ చేప వలకు చిక్కడంతో విషయం అంతటా పాకింది. ఆ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. చాలా మంది ప్రజలు జలాశయం వద్దకు ఆ చేపను చూసేందుకు వచ్చారు.
Also read:
Sirisha Bandla: నా కల నిజమవుతుందని తెలుసు.. అమెరికాలో వ్యోమగామి కానున్న ఆంధ్రా అమ్మాయి శిరీష బండ్ల..
Realme: ‘రియల్ మీ’ సంచలనం.. రూ. 5 వేలులోపే అధునాతన ఫీచర్లతో సూపర్ ఫోన్లు..