Telangana: 30 ఏళ్లుగా కారడవిలోనే నివాసం.. వృద్ధుడైనా ఫుల్ ఫిట్‌ అండోయ్..!

|

May 22, 2022 | 8:59 AM

Telangana: అదో దట్టమైన అరణ్యం..చుట్టూ ఎత్తైన కొండలు..సాయంత్రం ఐదు గంటలు దాటితే చిమ్మచీకటి. గొంతెత్తి అరిచినా..పలికే నాథుడే లేడు.

Telangana: 30 ఏళ్లుగా కారడవిలోనే నివాసం.. వృద్ధుడైనా ఫుల్ ఫిట్‌ అండోయ్..!
Forest Man
Follow us on

Telangana: అదో దట్టమైన అరణ్యం..చుట్టూ ఎత్తైన కొండలు..సాయంత్రం ఐదు గంటలు దాటితే చిమ్మచీకటి. గొంతెత్తి అరిచినా..పలికే నాథుడే లేడు. త్రాగటానికి నీరు కావాలన్నా..భగీరథ ప్రయత్నమే చేయాలి. ఇలాంటి ప్రాంతంలో భాహ్య ప్రపంచానికి దూరంగా ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 30 ఏళ్లు అడవిలోనే జీవనం సాగిస్తున్నాడు ఓ వృద్దుడు. ఇంతకీ ఆయన అరణ్యవాసం చేయాల్సిన అవసరం ఏమోచ్చింది..? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

కారడవిలో నివసిస్తున్న వృద్దుడి పేరు చిప్పల చెన్నారెడ్డి. ఊరు భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట. అదే గ్రామానికి చెందిన వెంకమ్మను వివాహం చేసుకున్న చిన్నారెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. 30 ఏళ్ల క్రితం తోటి మిత్రులతో కలిసి అడవిలోకి వెళ్లి అక్కడి వాతావరణానికి పరవశించిపోయాడు. అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు చెన్నారెడ్డి. భార్య, పిల్లలకు తన మనస్సులోని మాట చెప్పేసి.. దట్టమైన అడవుల మధ్య 4 ఎకరాల పోడు వ్యవసాయం మొదలు పెట్టాడు. మొదట జీడి మామిడి మొక్కలను నాటి.. అదే తోటలో గుడిసె వేసుకొని ఉండిపోయాడు. మేకలు, కోళ్లను పెంచుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.

తెల్లవారుజామునే చెన్నారెడ్డి దినచర్య ప్రారంభమవుతుంది. అడవిలోకి మేకలను తీసుకెళ్లి.. మధ్యాహ్నానికి తన గుడిసెకు చేరుకుంటాడు. గుడిసెలోనే వండుకొని, జీడితోటకు కాపలాగా ఉంటాడు చెన్నారెడ్డి. ఈ అటవీ ప్రాంతంలో కరెంట్‌ ఉండదు, త్రాగేందుకు నీరు కూడా సరిగ్గా లభించదు. పక్కనే ఉన్న సెలయేళ్లు, వాగుల్లోని చెలమల ద్వారా నీటిని తెచ్చుకుంటాడు చెన్నారెడ్డి.

30 ఏళ్లపాటు బాహ్యా ప్రపంచానికి దూరంగా ఉంటున్న చిప్పల చెన్నారెడ్డిని కలిసేందుకు టీవీ9 బృందం దండకారణ్యానికి బయల్దేరింది. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వరావుపేట మండలం దిబ్బగూడెం ఏజెన్సీకి అష్టకష్టలు పడుతూ 5 కిలోమీటర్లు వాగులు, దట్టమైన పొదలు దాటుతూ వెళ్లారు. 68 ఏళ్ల వయస్సులోనూ యాక్టివ్‌గా ఉన్న కొండరెడ్ల గిరిజన తెగకు చెందిన చెన్నారెడ్డిని టీవీ9 పలుకరించింది. ప్రకృతితో మమేకమైపోయిన చెన్నారెడ్డి జీవనవిధానాన్ని కెమెరాలో బంధించింది టీవీ9.

30 ఏళ్లుగా అడవిలో ఉంటున్న తనకు ఎలాంటి రోగాలు దరిచేరలేదన్నాడు వృద్దుడు చెన్నారెడ్డి, చిన్న చిన్న నొప్పులు వస్తే..అక్కడే ఉన్న ఔషధమొక్కలతో నయం చేసుకుంటానని తెలిపారు. గ్రామంలో కన్నా అటవీప్రాంతంలోనే ప్రశాంతంగా ఉన్నానని చెబుతున్నాడు. భార్య, పిల్లలు చూడాలంటే వాళ్లే దట్టమైన అటవీప్రాంతానికి వెళ్లి చెన్నారెడ్డిని చూసి వస్తారు. అదే సమయంలో ఆయనకు ఒక బస్తా బియ్యం, కాస్తా పచ్చళ్లు ఏవైనా ఉంటే ఇస్తామని చిన్నారెడ్డి భార్య చెబుతున్నారు. మొత్తానికి దట్టమైన అడవిలో వానకు తడుస్తూ, ఎండను భరిస్తూ, చలిని తట్టుకొని ఒంటరిగా ఉంటున్న చెన్నారెడ్డిని అంతా అభినందిచాల్సిందే.