Watch: వీళ్లు కదా నిజమైన పోలీసులు అంటే.. కష్టకాలంలో అన్నదాతకు ఆసరైనా అచ్చంపేట ఖాకీలు

పోలీసులు అంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షకులు మాత్రమే కాదు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే పరోపకారులు కూడా అని తాజాగా జరిగిన ఓ సంఘటన నిరూపిస్తోంది. వర్షం కారణంగా తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కష్టపడుతున్న రైతులను చూసి చలించిపోయిన పోలీసులు వారికి సాయం చేసి అందరి మన్ననలు పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రతస్తుం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: వీళ్లు కదా నిజమైన పోలీసులు అంటే.. కష్టకాలంలో అన్నదాతకు ఆసరైనా అచ్చంపేట ఖాకీలు
Police Help Farmers

Edited By:

Updated on: May 24, 2026 | 2:55 PM

పోలీసులు అంటే కేవలం శాంత్రిభద్రతలను కాపాడే వారు మాత్రమే కాదు.. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచే ఆపద్బాందవులు కూడా అని తాజాగా జరిగిన ఓ సంఘటన నిరూపించింది. వర్షం కారణంగా తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు పడుతున్న కష్టాన్ని చూసి చలించిన రైతులు వారికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలకు మార్కెట్ యార్డులోని మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. గడచిన వారం రోజుల్లో రెండుసార్లు అకాల వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. ఓ పక్క మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. చేసిన వాటిని గోదాములకు తరలించడం లేదు. దీంతో మార్కెట్ యార్డులతో పాటు కల్లాల్లో పెద్ద ఎత్తున మొక్కజోన్న ధాన్యం నిలిచిపోయింది. అరుగాలం పండించిన పంటను అమ్ముకునే విషయంలో ఈసారి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు. రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లోనే ధాన్యానికి కాపాల కాస్తున్నారు.

ఇక దీనికి తోడు అకాల వర్షాలు రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో మార్కెట్ యార్డుల్లో మొక్కజోన్న ధాన్యం తడుస్తోంది.. వాన నీటిలో కొట్టుకుపోతోంది. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు వర్షంలోనే కష్టాలు పడుతున్నారు రైతన్నలు. తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబోసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తేమశాతంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం ఒక్కసారిగా వాన నీటికి తడిసి తక్కువ ధర పలుకుతోంది. నిన్న సాయంత్రం అచ్చంపేట మార్కెట్ యార్డులో వర్షం తగ్గిన తర్వాత కొంతమంది రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టే ప్రయత్నం చేశారు.

వాన నీటిలో తడిసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతంలో ఆరబోసేందుకు కష్టాలు పడ్డారు. ఈ క్రమంలో అన్నదాతలు పడుతున్న కష్టాలను చూసి అక్కడున్న పోలీసులు చలించిపోయారు. ఎస్సై సద్దాం, ఆయన సిబ్బంది అన్నదాతలకు తోడయ్యారు. తడిసిన ధాన్యాన్ని బుట్టల్లో ఎత్తుకొని నీరు లేని ప్రాంతంలో ఆరబోశారు. సదరు రైతు కుటుంబానికి తోడుగా మహిళ కానిస్టేబుల్స్ సైతం తమ వంతు సహాయం అందజేశారు. అందరూ తలా ఒక చేయి వేసి.. తామున్నామంటూ అండగా నిలిచారు.

ఎప్పుడు కాఠిన్యంగా కనిపించే ఖాకీలు చేస్తున్న పనిని అక్కడ ఉన్న వారు ఆశ్చర్యంగా చూశారు. కష్టాల్లో ఉన్న రైతులకు తోడుగా నిలవడం పట్ల అభినందనలు తెలిపారు. పోలీసులు అంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షకులే కాకుండా కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటారని సంఘటన రుజువు చేసింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us